04-02-2026 02:23:01 AM
హస్తం పార్టీలో మున్సిఫైర్
హైదరాబాద్, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి) : మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి భగ్గుమంటున్నది. ఏళ్లతరబడి పార్టీ కోసం సర్వం త్యాగం చేస్తే.. తీరా ఎన్నికలు వచ్చేసరికి పోటీచేసే అవవకాశం ఇవ్వరా? అని కాంగ్రెస్ అధిష్ఠానంపై పార్టీ కేడర్ ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నది. ‘పదేళ్లు ప్రతిపక్షంలో ఉండి.. అప్పటి అధికార బీఆర్ ఎస్‌పై కొట్లాడాం.. ఆస్తులు అమ్ముకున్నాం.. తమ జీవితాలను సర్వం కోల్పో యాం..
ఇప్పుడు పురపోరులో పోటీకి అవకాశం ఇవ్వకుండా, డబ్బులిచ్చిన వారికి బీ ఫామ్‌లు అమ్ముకుంటారా..? అని టికెట్ దక్కనివారు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పాత నేతలు.. వలస నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. జగిత్యాల, స్టేషన్‌ఘన్‌పూర్, గద్వాల, చేవెళ్ల, బాన్సువాడ, పటాన్‌చెరు తదితర నియోజకవర్గాల్లో ఈ విభేదాలు నిప్పుపుట్టిస్తున్నాయి.
మంత్రు లు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనూ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకా శం దక్కనివారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రు. కొందరు రెబల్స్‌గా బరిలో ఉండగా, మరికొందరు ఇతర పార్టీలోకి వలస వెళ్లి బరిలో ఉన్నారు. ఇక కొన్ని చోట్ల కాంగ్రెస్‌కు మిత్రపక్షమైన సీపీఐ పార్టీ కూడా అధికార కాంగ్రెస్‌పై గుర్రుగా ఉంది. పొత్తులో భాగంగా కొన్ని వార్డులకు తమకు అవకాశమిస్తాని చెప్పి.. చివరలో చెయ్యిచ్చారని సీపీఐ నేతలు మండిపడుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎలా గెలుస్తుందో చూస్తామని హెచ్చరికలు కూడా చేస్తున్నారు. మహబూబాబాద్ పట్టణంలో సీపీఐకి ఐదు సీట్లు ఇస్తామని, చివరకు ఒకటి కూడా ఇవ్వకుండా కాంగ్రెస్ గొంతు కోసిందని.. మున్సిపల్ ఎన్నికల్లో తగిన బుద్ధ్ది చెబుతామని సీపీఐ నేతలు అంటున్నారు. ఇక్కడ సీపీఎం పార్టీకి కాంగ్రెస్ నాలుగు సీట్లు కేటాయించడం విశేషం.
ఇక ప్రధానంగా జగిత్యాల నియోజకవర్గంలో మాజీమంత్రి జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ వర్గాల మధ్య ఢీ అంటే ఢీ అనే స్థాయిలో పంచాయతీ నడుస్తోంది. పార్టీ అధిష్ఠానం జీవన్‌రెడ్డి, సంజయ్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు చేసిన ప్రయత్నాలు పలించకపోగా..పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే వరకు వెళ్లింది. బాన్సువాడలో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, కామారెడ్డిలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, టీ పీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్‌రెడ్డిల వర్గపోరు తీవ్రతరమైంది.
ఆ రెండు నియోజకవర్గాల్లో తమ అనుచరులకు టికెట్ రాకపోవడంతో.. ఒకరినొకరు సహకరించుకునే పరిస్థితి ఉండదని చెబుతున్నారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలోని పలు మున్సిపాలిటిల మధ్య ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ తమ అనుచరులను బరిలోకి దింపేందుకు పట్టుబట్టారు. వీరిద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు భువగిరిలోని ఒక హోటల్‌లో సమావేశం నిర్వహించినా ఫలితం దక్కలేదు.
టికెట్ దక్కిన వారికి.. టికెట్ రానివారు సహకరిస్తారనే గ్యారెంటీ లేదని, తద్వారా పార్టీ విజయంపై ప్రభావం పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నల్లగొండ కార్పోరేషన్‌లోనూ ఐదుగురు కాంగ్రెస్ సీనియర్లకు టికెట్ రాకపోవడంతో వారు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి బరిలో నిలిచినట్లుగా చెబుతున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో వలస నేత కడియం శ్రీహరి, కాంటెస్టెడ్ అభ్యర్థి ఇందిర వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి.
సంగారెడ్డి జిల్లాలోని జిన్నారం మున్సిపాలిటిలోని 4 వార్డులో బీసీ వర్గానికి చెందిన శ్రీలతకు ఇవ్వకపోవడంతో ఎంపీడీవో కార్యాలయం ముందే నిరసన వ్యక్తం చేశారు. తనకు టికెట్ రాకుండా అడ్డుకున్న వారు నాశనమై పోతారని శాపనార్థాలు పెట్టారు. వనపర్తి మున్సిపాటిలో లక్ష్మికి టికెట్ దక్కకపోవడంతో మాజీ మంత్రి చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శివసేన్‌రెడ్డిలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీని నమ్ముకుని పనిచేస్తే ఎన్నికల ముందు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్ ఇచ్చి.. తనకు మొండి చెయ్యి చూపిస్తారా..? అంటూ నిలదీశారు. రాష్ట్రంలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొందని కాంగ్రెస్ వర్గాలే చెబుతున్నాయి.
టికెట్ దక్కినా టెన్షనే..!
‘పంచాయతీ ఎన్నికల్లో రెబల్స్ వల్లే అనుకున్న సీట్లలో విజయం సాధించలేదు.. ఇప్పుడు మున్సిపాలిటిల్లో రెబల్స్ లేకుండా చూడాలి.. 90 శాతం వరకు హస్తగతం చేసుకోవాలి. అందుకు ఇన్‌చార్జ్ మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లదే బాధ్యత’ అని సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే పలుమార్లు దిశానిర్దేశం చేశారు. గెలిచే వారికే టికెట్లు ఇవ్వాలని కూడా హితబోధ చేశారు. అయితే స్థానికంగా మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు నాయకులు తమ అనుచరులకు టికెట్లు ఇప్పించుకుని..
పార్టీ కోసం కష్టపడిన సీనియర్లను, తమ వెంటఉండని వారికి మొండి చెయ్యి చూపించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పోటీకి అవకాశం దక్కని నేతల ఆవేదన ఇలా ఉంటే.. ఎలాగోలా బీ ఫామ్స్ సాధించుకున్న నేతలకు మరో టెన్షన్ వెంటాడుతోంది. పార్టీలో అవకాశం దక్కని నేతలు ఏ మేరకు సహకరిస్తారనే టెన్షన్ అభ్యర్థులను వెంటాడుతోంది. ఎలాగైనా అసంతృప్తులను తమకు సహకరించేలా బుజ్జగింపుల పర్వం మొదలుపెట్టారు. దీంతో మున్సిపల్ ఎన్నికలు ఎవరికి కలిసి రాబోతున్నాయి..? మరెవరికి బెడిసి కొట్టబోతున్నాయి అనేది చర్చనీయాంశమైంది.