20 May, 2026 | 1:19 AM

గల్లీలో మద్యం.. అధికారుల చోద్యం!

20-05-2026 12:00 AM
  1. వైన్ షాప్ యాజమాన్యాల  సిండికేట్ రాజ్యం. పల్లెల్లో జోరుగా మద్యం అమ్మకాలు & ప్రమాదంలో ప్రజల జీవితాలు
  2. తండాల్లో జోరుగా బెల్లం రవాణా, సారా అమ్మకాలు. పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు
  3. అక్రమ దందాను అరికట్టాలని వేడుకోలు

తుంగతుర్తి, మే 19 : తుంగతుర్తి మండలంలో వైన్ షాప్ ల యాజమాన్యం మద్యం సిండికేట్ దందా, అక్రమ విక్రయాలు, రోజురోజుకు పెరుగుతుండడంతో మద్యానికి ప్రజలు బానిసై ,రోగాల బారిన పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బెల్ట్ షాపులు రోజురోజుకు విస్తరించి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. అధికార యంత్రాంగం నియంత్రణ చర్యలు చేపడుతున్నట్టు చెబుతున్నప్పటికీ వాస్తవికంగా ఇటువంటి చర్యలు చేపట్టకపోవడంతో పండేవాసులు ఇబ్బందులకు గురవుతున్నారు.

మండలంలో  కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా బెల్ట్ షాపుల ద్వారానే మద్యం సరఫరా జరుగుతోందని స్థానికులే చెబుతున్నారు. దీంతో చిన్నారులు, యువతపై ప్రతికూల ప్రభావం పడుతోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సామాజిక సంస్థలు, మహిళా సంఘాలు ఈ సమస్యపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. అక్రమ మద్యం విక్రయాలను అరికట్టేందుకు అధికారులు చర్యలు తీసుకోకపోగా, మామూళ్ల మత్తులో తూగుతున్నరనే విమర్శలు స్థానికంగా వస్తున్నాయి.

గ్రామానికి 5 నుండి 10 బెల్ట్ షాపులు :  మండలం లోని పరిసర గ్రామాల్లో ఒక్కొక్క గ్రామములో సుమారు 5 నుంచి 10 బెల్ట్ షాపులు జోరుగా మద్యం విక్రయాలు సాగిస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లోని కొన్ని తండాల్లో నేడు నేరుగా సారా తయారు చేసి, జోరుగా విక్రయాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నిషేధం ఉన్నప్పటికీ అక్రమంగా నడుస్తున్న ఈ దుకాణాలపై ఎక్సైజ్ శాఖ చూసీ చూడనట్టు వ్యవహరిస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి.

కొన్ని ప్రాంతాల్లో ఎక్సైజ్ అధికారులు దాడులు చేసినప్పటికీ, కొద్ది రోజులకే అదే బెల్ట్ షాపులు మళ్లీ తెరుచుకుని యథావిధిగా వ్యాపారం కొనసాగిస్తున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. అక్రమ మద్యం విక్రయాల వల్ల గ్రామాల్లో సామాజిక సమస్యలు పెరుగుతున్నాయని, వెంటనే కట్టడి చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

బెల్ట్‌షాపులో ప్రతి బాటిల్ అదనపు వసూలు..

ఆరు కాలం కష్టపడి పనిచేసే పేద ప్రజలు బెల్ట్ షాపుల వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. ఒక క్వార్టర్ బాట్పి రూ.30 నుండి 50 వరకు అదనంగా వసూలు, బీరు బాటిల్ కైతే 80 నుంచి 100 రూపాయలు వసూలు చేస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీంతో రోజు కూలి చేసుకునే కార్మికుల జేబులు ఖాళీ అవుతున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

యువత భవిష్యత్తుపై ప్రభావం..

రోజంతా మద్యం అందుబాటులో ఉండడంతో యువతలో వ్యసనం పెరుగుతోంది. స్నేహితుల మధ్య గొడవలు, అప్పులు తెచ్చుకొని మరి తాగుతున్నారు. ఇది వారి ఆరోగ్యం, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కుటుంబాల్లో కలహాలు..

మద్యం ప్రభావంతో కుటుంబాల్లో కలహాలు పెరుగుతున్నాయని మహిళలు చెబుతున్నారు. సంపాదించిన డబ్బంతా మద్యం కోసం ఖర్చవుతుండటంతో కుటుంబాల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటోందని అక్రమ బెల్ట్ షాపులను వెంటనే మూసివేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు

అక్రమ దందాను అరికట్టాలి..

గ్రామాలలో ఇబ్బడి ముబ్బడిగా బెల్ట్ షాపులను ఏర్పాటు చేసి అధిక రేట్లకు మద్యం బాటిల్లను విక్రయిస్తూ   వైన్ షాపుల యాజమాన్యాలు అక్రమ దందాలు నిర్వహిస్తున్నాయి. దీన్ని అధికారులు ఏమాత్రం అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం బాధాకరం. వీటి ఫలితంగా అనేక కుటుంబాలు ఆర్థికంగా కుదియులయి, పొద్దున పడే అవకాశాలు ఉన్నాయి. కావున అధికారులు స్పందించి ఈ ఆక్రమ దందాను అరికట్టాలి.

- పూర్ణా నాయక్, ఏనకుంట తండా రైతు