‘జాబ్ సీకర్స్’ నుంచి ‘జాబ్ క్రియేటర్స్’
స్వయం ఉపాధి వైపు తెలంగాణ యువత
ప్రభుత్వ ఉద్యోగాల కంటే వ్యాపారాల వైపు మొగ్గు
స్టార్టప్‌లపై పెరుగుతున్న ఆసక్తి
- వేగంగా విస్తరిస్తున్న స్టార్టప్ కల్చర్
- ఇప్పటికే రాష్ట్రంలో 11 వేలకు పైగా స్టార్టప్‌లు
- టీ-హబ్, వీ-హబ్‌లతో ఔత్సాహికులకు ప్రోత్సాహం
హైదరాబాద్, మే 19 (విజయక్రాంతి) : ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో జాప్యం, అటు ఐటీ రంగంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) కారణంగా కొత్త కొలువులకు అవకాశం లేకుండా పోతోంది. మరో వైపు సర్కారు కొలువుల్లో తీవ్రమైన పోటీ, ప్రైవేట్ రంగంలో ఉద్యోగ భద్రత లేకపోవడంతో యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేస్తోంది. ఉద్యోగాల కోసం ఎదురుచూసే ధోరణి నుంచి ఉద్యోగాలను సృష్టించే దిశగా వారి ఆలోచనా విధానం మారుతోంది.
ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగమే జీవిత లక్ష్యంగా భావించగా.. ఇప్పుడు పరిస్థితులకు అనుగుణంగా కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. స్వంతంగా అవకాశాలను సృష్టించుకోవాలనే ఆలోచనతో స్టార్టప్‌లు, ఫ్రీలాన్సింగ్, డిజిటల్ వ్యాపారాల వైపు అడుగులు వేస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా విస్తరిస్తున్న స్టార్టప్ కల్చర్ యువతలో కొత్త ఆశలను రేకెత్తిస్తోది. టీ-హబ్, వీ-హబ్, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు, సోషల్ మీడియా అవకాశాలతో ‘జాబ్ సీకర్’ నుంచి ‘జాబ్ క్రియేటర్’గా మారేందుకు యువత ప్రయత్నిస్తోంది.
తగ్గిన నియామకాలు.. ఫ్రెషర్స్‌పై తీవ్ర ప్రభావం
రాష్ట్రంలో ప్రతి ఏటా లక్షలాది మంది ఇంజినీరింగ్, డిగ్రీ, పీజీ కోర్సులు పూర్తి చేస్తున్నారు. కానీ అందరికీ తగిన స్థాయిలో ఉద్యోగాలు దొరకడం లేదు. ముఖ్యంగా ఐటీ రంగంలో గత కొంతకాలంగా నియామకాలు తగ్గడం ఫ్రెషర్స్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. క్యాంపస్ ప్లేస్‌మెంట్లు తగ్గిపోవడం, అనుభవం లేక ఉద్యో గాలు దొరక్కపోవడం వల్ల చాలామంది యువకులు నిరాశలోకి వెళ్తున్నారు. ఈ పరిస్థితుల్లో చిన్న వ్యాపారాలు, డిజిటల్ సేవలు, ఫ్రీలాన్సింగ్, స్టార్టప్‌ల వైపు అడుగులు వేస్తున్నా రు. తెలంగాణ ప్రభుత్వం స్టార్టప్ ఎకోసిస్టంను బలోపేతం చేయడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు చెబుతోంది.
స్టార్టప్ హబ్‌గా హైదరాబాద్
రాష్ట్ర స్టార్టప్ పోర్టల్ గణాంకాల ప్రకారం తెలంగాణలో 11, 800కు పైగా స్టార్టప్‌లు నమోదయ్యాయి. వీటిలో దాదాపు 5,900 కు పైగా మహిళల ఆధ్వర్యంలోని స్టార్టప్‌లు ఉండటం ప్రత్యేకతగా చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 70కి పైగా ఇంక్యుబేషన్ సెంటర్లు పనిచేస్తున్నాయని అధికారిక సమాచారం. ముఖ్యంగా హైదరాబాద్.. దేశంలో ప్రముఖ స్టార్టప్ హబ్‌లోలో ఒకటిగా ఎగడం యువతకు సానుకూల అంశంగా మారుతోంది.
టీ--హబ్, వీ-హబ్, టీ--వర్క్స్ వంటి వే దికల ద్వారా యు వ పారిశ్రామికవేత్తలకు సాంకేతిక సహాయం, మెంటరింగ్, పెట్టుబడిదారుల పరిచయాలు, మార్కెట్ కనెక్టివిటీ అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. టీ- ద్వారా వెయ్యికి పైగా స్టార్టప్‌లకు మద్దతు అందినట్టు గణాంకాలు చెబుతున్నా యి. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు వీ--హబ్ ప్రత్యేక కార్యక్రమా లు నిర్వహిస్తోంది. ఇక టాస్క్ ద్వారా విద్యార్థులకు పరిశ్రమ అవసరాలకు తగ్గ స్కిల్స్ అందించి ఉద్యోగయోగ్యత పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
యువత కూడా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలకే పరిమితం కాకుండా కొత్త రంగా ల్లో అవకాశాలను వెతుకుతోంది. ఫుడ్ డెలివరీ, క్లౌడ్ కిచెన్లు, యూట్యూబ్ ఛానెల్స్, సోషల్ మీడియా మార్కెటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, యాప్ డెవలప్‌మెంట్, ఫ్రీలాన్స్ కో డింగ్, డిజిటల్ కంటెంట్ క్రియేషన్ వంటి రంగాల్లో యువత ప్రవేశిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో అగ్రిటెక్, డైరీ, ఫుడ్ ప్రాసెసింగ్, హ్యాండీక్రాఫ్ట్ ఉత్పత్తుల వంటి రంగాల్లో రాణిస్తున్నారు.
ప్రభుత్వ ప్రోత్సాహమూ అవసరం
స్టార్టప్ కలలు కనిపిస్తున్నంత సులభంగా వాస్తవం కావడం లేదని నిపుణులు చెబుతున్నారు. పెట్టుబడి సమీకరణ సమస్యగా మారుతోంది. బ్యాంకు రుణాలు పొందడం కష్టమవుతుండగా, ప్రైవేట్ ఇన్వెస్టర్ల మద్దతు కూడా అందరికీ లభించడం లేదు. చాలా మంది యువతకు వ్యాపార నిర్వహణపై అవగాహన లేకపోవడం మరో సవాల్. మార్కెటింగ్, అకౌంటింగ్, లీగల్ అనుమతులు, పన్నుల వ్యవహారాలపై సరైన మార్గ దర్శకత్వం లేక చాలామంది వెనక్కి తగ్గుతున్నారు.
నగరాలతో పోలిస్తే గ్రామాల్లో మా ర్కెట్ కనెక్టివిటీ తక్కువగా ఉండటం, డిజిటల్ మౌలిక వసతులు పరిమితంగా ఉండటం, శిక్షణ అవకాశాలు అందుబాటులో లేకపోవడం స్వయం ఉపాధి విస్తరణ నెమ్మదిగా సాగుతోంది. మరోవైపు కుటుంబ ఆర్థిక పరిస్థితులు కూడా చాలామంది యువత కలలకు అడ్డంకిగా మారుతున్నాయి. స్థిర ఆదాయం వచ్చే ఉద్యోగం వదిలి వ్యాపారం చేయడంపై కుటుంబ సభ్యులు కూడా సందేహాలు వ్యక్తం చేస్తున్నారని చెబుతున్నారు.
స్వయం ఉపాధిపై మహిళల్లోనూ పెరుగుతున్న ఆసక్తి
మహిళా యువతలో కూడా స్వయం ఉపాధిపై ఆసక్తి పెరుగుతోంది. ఆన్‌లైన్ బొటిక్‌లు, హోమ్ ఫుడ్ బిజినెస్లు, బ్యూటీ సర్వీసులు, డిజిటల్ కంటెంట్ రంగాల్లో ముందుకు వస్తున్నారు. కానీ భద్రత, ఆర్థిక స్వావలంబన, కుటుంబ బాధ్యతలు వంటి అంశాలు ఇంకా సవాళ్లుగానే ఉన్నాయి. ప్రభుత్వాలు స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తున్నామని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరుగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ముద్ర రుణాలు, స్టార్టప్ పథకాలు, యువ పారిశ్రామికవేత్తల ప్రోత్సాహకాలు ఉన్నప్పటికీ వాటి ప్రయోజనం నిజంగా అర్హులైన యువతకు ఎంతవరకు చేరుతోంది.. అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చాలామంది రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయితే పరిస్థితులు ఎలా ఉన్నా తెలంగాణ యువతలో స్వయం ఉపాధే భవిష్యత్తు అన్న భావన రోజురోజుకూ బలపడుతోందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఉద్యోగాల కోసం ఎదురుచూడటం కంటే స్వంత అవకాశాలు సృష్టించుకోవాలనే ఆలోచనతో కొత్త తరం ముందుకు సాగుతోంది.






