calender_icon.png 23 February, 2026 | 9:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెల్‌ఫోన్‌తో జీవితాలు ఛిద్రం!

16-11-2025 12:04:20 AM

నానమ్మలు, అమ్మమ్మలు చంటి పిల్లలను చంకనేసుకొని ‘చందమామ రావే.. జాబిల్లి రావే.. కొండెక్కి రావే.. గోరుముద్ద తేవే’ అంటూ లాలి పాటలు పాడుతూ గోరుముద్దలు తినిపించే రోజులు పోయి ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఫోన్‌తోనే రోజులు గడుస్తున్నాయి. ఫోన్ చూపిస్తూ తినిపించటమే చిన్నపిల్లలకు పెద్ద శాపంగా మారింది. చిన్నపిల్లలు సెల్లు లేనిదే నిమిషం కూడా ఉండలేని పరిస్థితి నెలకొంది. పడుకునే ముందు ఫోన్ చూడని దే నిద్రపట్టని స్థితి ఏర్పడి, చిన్నపిల్లల ఎదుగుదలపై ప్రభావం పడుతుంది. 

బయటకు వెళ్లి ఆడుకునేలా పిల్లలను ప్రోత్స హించాలి. తల్లిదండ్రులు ఇంట్లో పనులకు అలవాటు చేస్తే పిల్లలు సెల్ ఫోనుకు దూరమయ్యే అవకాశాలుంటాయని నిపుణులు చెప్పే మాట. పిల్లల ఆరోగ్యంపై సెల్ ఫోన్, స్మార్ట్ ఫోన్ డిజిటల్ పరికరాల వలన తీవ్ర ప్రభావం పడుతోంది. చిన్నారుల్లో ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలు తలెత్తి చదువులో వెనుకబడిపోతున్నారు. చాటింగ్, వీడియో గేమ్‌లు ఆడుతూ ఉండటంతో చదువుకు దూరం అయ్యే ప్రభావం ఉంది. 

కంటి సమస్యలు 

పగలు, రాత్రి తేడా లేకుండా సెల్ ఫోన్‌ను విరివిగా వాడటం, ఆలస్యంగా తినడం పడుకోడటం వలన కంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ప్రస్తుతం చాలామంది పిల్లలు చిన్న వయసులోనే అద్దాలు పెట్టుకునే కనబడుతున్నారు.

ప్రాణాలు తీస్తున్న ఆన్‌లైన్ గేమ్స్

బెట్టింగ్ యాప్‌ల ద్వారా తక్కువ సమయంలో డబ్బు సంపాదించాలని అత్యాశకు  పోయి యువకు లు ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసలై లక్షల రూపాయలు పోగొట్టుకుని అప్పులపాలై వారి జీవితాలను ఛిద్రం చేసుకుంటున్నారు. ఆత్మహత్యలు కూడా చేసుకుంటు న్నారనే వార్తలు టీవీల్లో, పత్రికల్లో రోజూ చూస్తూనే ఉన్నాం.

స్మార్ట్ ఫోన్లలో చెప్పే మోసపూరిత బెట్టింగ్‌ల కు ఎక్కువ ఆకర్షితులు కావడం మూలాన ప్రమాదం లో పడుతున్నారు. పిల్లల భద్రత దృష్ట్యా బెట్టింగ్ యాప్‌లు, ఆన్లైన్ గేమ్‌లను నిషేధిస్తే కొంతమేర సెల్ ఫోన్ వాడకాన్ని తగ్గించవచ్చని, అలాగే పిల్లల ముందు తల్లిదండ్రులు కూడా ఫోన్ వాడకుండా ఉండటం ఉత్తమమని కొందరు నిపుణుల అభిప్రాయం. 

క్రీడల వైపు దృష్టి మళ్లించాలి

స్మార్ట్ ఫోన్‌లో అశ్లీల దృశ్యాలు, క్రైమ్, బెట్టింగ్‌లు వంటి యాప్‌ల వలన పిల్లల ఆలోచన విధానం మారు తుంది. అందుచేత తొందరగా చెడు అలవాట్లకు యు వత ఆకర్షితులవుతున్నారు. పిల్లల దృష్టిని మైదానం వైపు మళ్లించేలా చొరవ తీసుకొని క్రీడల పట్ల ఆసక్తి పెంచి ఉల్లాసంగా ఆటపాటలతో గడిపేలా చూడాలి. ఎలాంటి ఆటలు లేకపోవడం చేత సెల్ ఫోన్‌లో బందీలుగా మారుతున్నారు. చివరికి పాఠశాలల్లో హోంవర్క్ ఇస్తే గూగుల్‌పై ఆధారపడుతున్నారు. దీంతో సృజనాత్మకతను కోల్పోతున్నారు.

తల్లిదండ్రుల ప్రత్యేక శ్రద్ధ అవసరం

తల్లిదండ్రులు పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తే మేలు జరిగే అవకాశం ఉంది. సెల్ ఫోన్ వలన కలిగే అనార్ధాల గురించి పిల్లలతో తరచూ చర్చిస్తూ ఉండాలి. పాఠశాల నుంచి ఇంటికి రాగానే దగ్గరుండి హోంవర్క్ చేయించాలి.

ఉపాధ్యాయులు క్రమశిక్షణ లో భాగంగా పిల్లలను మందలిస్తే, వారి ముందు తల్లిదండ్రులు ఉపాధ్యాయులపై గొడవ చేయడం వలన విద్యార్థులు చెడు దారిలో వెళ్లే ప్రమాదం ఉంది. అలాగే తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్ వాడకుండా ఉంటే ఇంకా చాలా మంచిది. పిల్లల పట్ల ప్రతి కుటుంబంలో అప్రమత్తంగా గమనిస్తూ క్రమశిక్షణ అందించాలి. రాబోయే తరాలకు సన్మార్గం చూపాలి.

శ్రీనివాసరావు, సామాజిక ఉద్యమ నాయకుడు (ముస్తాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లా)