calender_icon.png 16 November, 2025 | 1:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైనర్ నేరం.. మేజర్ శిక్ష!

16-11-2025 12:05:44 AM

మైరాం చేస్తున్నారనో, దగ్గర్లో ఉన్న దుకాణాల్లో సరుకులు తేవాలనో కొందరు తల్లిదండ్రులు మైనర్లన తమ పిల్లలకు వాహనాలు ఇచ్చి పంపుతు న్నారు. ఇంకొందరు తమ పిల్లలకు బైక్ కొనిచ్చి.. స్కూళ్లకు పంపుతున్నారు. అయితే మోటార్ వెహికల్స్ యాక్ట్ 2019 ప్రకారం మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడితే తల్లిదండ్రులు లేదా వాహన యజమాని జవాబుదారీగా ఉండాలి. 

మైనర్ డ్రైవింగ్ నేరమని తెలిసినా చాలామంది తల్లిదండ్రులు పెడచెవిన పెడుతున్నారు. మోటార్ వెహికల్ చట్టం ప్రకారం 18 ఏళ్ల లోపు పిల్లలు ద్విచక్ర వాహనాలు నడపడం మైనర్ డ్రైవింగ్‌గా పరిగణించబడుతోంది. ఇది నేరం. ఇటువంటి నేరానికి పిల్లలతోపాటు వాహన యజమాని బాధ్యత వహించాల్సిందే. ఇతర దేశాల్లో మైనర్లు డ్రైవింగ్ చేస్తే తల్లిదండ్రులకు జరిమా నా విధిస్తున్నారు.

అంతేకాకుండా మూడు సార్లు పట్టుపడితే తల్లిదండ్రుల డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేసే కఠిన చట్టాలు అమల్లో ఉన్నాయి. మన దేశంలో కూడా అటువంటి నిబంధనలే ఉన్నా, కఠినంగా అమలు కావడం లేదు. దాంతో మైనర్లు ‘రయ్’మంటూ బైకులపై దూసుకెళ్తున్నారు. 

తల్లిదండ్రులే జవాబుదారులు

మోటార్ వెహికల్స్ యాక్ట్ 2019 ప్రకారం మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడితే తల్లిదండ్రులు లేదా వాహన యజమాని జవాబుదారీగా ఉండాలి. పోలీసులు తీసుకునే చట్టపరమైన చర్యలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది. కోర్టు వాహన యజమానులకు మూడేళ్ల జైలుశిక్ష, రూ.25 వేల జరిమానా విధించే అవకాశం ఉంది. ఏడాది పాటు వాహన రిజిస్ట్రేషన్ద్ద్రు అవుతుంది. మైనర్లు డ్రైవింగ్ చేసి పోలీసులకు చిక్కితే వారికి 25 ఏళ్ల వయసు వచ్చేంత వరకు లైసెన్స్ పొందే అవకాశం ఉండదు. మైనర్లు చేసే ప్రమాదాలకు ఇన్సూరెన్స్ కూడా వర్తించదు. నేరం రుజువైతే వారిని జువెనైల్ హోంకూ తరలించవచ్చు. 

లెర్నర్ లైసెన్స్‌కు ఇవే అర్హతలు

నిబంధనల ప్రకారం 18 ఏళ్లు నిండని వారికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు. ఎలక్ట్రిక్ లేదా గేర్ లేని వాహనాలు నడపడానికి లైసెన్స్ పొందాలంటే కనీసం 16 ఏళ్ల వయసు ఉండాలి. తల్లిదండ్రుల లిఖితపూర్వక అనుమతి పత్రం సమర్పించాలి. గేర్‌తో కూడుకున్న వాహనాలకు లైసెన్స్ పొందాలంటే 18 ఏళ్లు పైబడి ఉండాలి. 

నిబంధనలు

లెర్నర్ నడిపేటప్పుడు వాహనంపై ‘L’ బోర్డు స్పష్టంగా ఉండాలి. వారి వెంట లైసెన్స్ కలిగిన వ్యక్తి ఉండాలి. వాహనం నడిపేటప్పుడు సెల్ ఫోన్ వాడకూడదు. పిల్లలు లైసెన్స్ పొందేవరకు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. 18 ఏళ్లు నిండకుండా స్కూళ్లు, కాలేజీలకు సొంతంగా వాహనాలు డ్రైవ్ చేసుకుంటూ వచ్చే విద్యార్థులను అధ్యాపకులు హెచ్చరించాలి. 

 సిద్దిపేట క్రైమ్