5 July, 2026 | 3:04 AM

రాజకీయ ఉచ్చులో పడితే జీవితాలు నాశనం

05-07-2026 01:17 AM

తెలంగాణ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు గోపిరెడ్డి

హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): పోలీసు ఉద్యోగాల కోసం చెమటోడుస్తున్న నిరుద్యోగ అభ్యర్థులు కొందరు స్వార్థపరుల రాజకీయ ప్రేరేపిత ఆందోళన కార్యక్రమాలకు దూరంగా ఉండాలని, రాజకీయ ఉచ్చులో పడితే జీవితాలు నాశనం  అవుతాయని తెలంగాణ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు వై గోపిరెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన ప్రకటనలో మాట్లాడుతూ.. ‘ఎన్నికల లబ్ధికోసం, రాజకీయ ప్రయోజనాల కోసం నిరుద్యోగులను రోడ్లపైకి నెట్టి ఉచ్చులోకి లాగేందుకు కొన్ని శక్తులు వ్యూహాత్మకంగా ప్రయత్నిస్తున్నాయి.

ఇటువంటి రెచ్చగొట్టే నిరసన కార్యక్రమాలలో పాల్గొని శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే, చట్టపరమైన పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో అభ్యర్థులు గ్రహించాలి. పోలీసు కేసులు నమోదైతే, భవిష్యత్తులో ఏ ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాడానికైనా అర్హతను పూర్తిగా కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. ఒకసారి క్రిమినల్ రికార్డు నమోదైతే క్యారెక్టర్ వెరిఫికేషన్ సమయంలో అభ్యర్థుల కలలన్నీ కల్లలైపోతాయి.

కాబట్టి యువత ఎంతో విచక్షణతో వ్యవహరించి, ఇలాంటి రాజకీయ కుతంత్రాలకు బలికాకుండా తమ బంగారు భవిష్యత్తును కాపాడుకోవాలి. పోలీసు ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ బోర్డ్ నిర్వహించే పరీక్షలు పూర్తి పారదర్శకంగా, కేవలం ప్రతిభ ఆధారంగానే జరుగుతాయి’ అని చెప్పారు. ఐదువేల పోస్టులలో సివిల్ కానిస్టేబుళ్లు, ఆరమ్డ్ రిజర్వ్ కానిస్టేబుళ్లతో పాటు సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు కూడా ఉన్నాయి. ఈ మేరకు వెలువడిన ఉత్తర్వుల ఆధారంగా అభ్యర్థులు ఏమాత్రం సమయం వృథా చేయకుండా తక్షణమే తమ సన్నద్ధతను ప్రారంభించాలని సూచించారు. త్వరలోనే రెండో దశ కింద మరో రెండు వేల పోలీసు ఉద్యోగాలను నింపేందుకు కూడా నోటిఫికేషన్ వెలువడనుందని వెల్లడించారు.