ప్రజారోగ్య పరిరక్షణకు పకడ్బందీ చర్యలు
- కల్తీ ఆహార పదార్థాలపై ప్రత్యేక దృష్టి
- ఆహార భద్రతపై సమీక్షలో సీఎస్ సంజయ్ జాజు
హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రజారోగ్య పరిరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఆహార భద్రతా నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని, కల్తీ ఆహార పదార్థాలపై ప్రత్యేక దృష్టి సారించి నిరంతరం తనిఖీలు చేపట్టాలని పేర్కొన్నారు. సచివాలయంలో శనివారం సంబంధిత అధికారులతో సీఎస్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రగ్ కంట్రోలర్ విభాగం, ఫుడ్ సేఫ్టీ విభాగాలు సమన్వయంతో పని చేస్తూ రాష్ట్రంలో ఆహార భద్రతా ప్రమాణాల అమలు, నాణ్యతలపై నిరంతరం తనిఖీలు నిర్వహించి ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటి వరకు ఉన్న రెండు విభాగాలను ఏకతాటిపై నడిపేందుకు తగిన ప్రతిపాదనలను వారం రోజుల్లోగా సిద్ధం చేయాలని సూచించారు. ఇతర రాష్ట్రాలలో అమలు చేస్తున్న విధానాన్ని అధ్యయనం చేసి మన రాష్ట్రంలో కూడా అమలు చేసేందుకు ప్రణాళికలను రూపొందించా లన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసులు, వాటి పురోగతిపై చర్చించారు.
ఈ సమావేశంలో సీఎం సలహాదారు, ఎక్స్-అఫీషియో ప్రత్యేక ప్రధానకార్యదర్శి కే రామకృష్ణారావు, డీజీపీ సీవీ ఆనంద్, సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీలు శేషాద్రి, ఎన్ శ్రీధర్, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీం, అడిషనల్ డీజీ(ఇంటెలిజెన్స్) విజయ్ కుమార్, వైద్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ క్రిస్టినా చొంగ్తూ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వీ.కర్ణన్, వైద్యశాఖ కమిషనర్ సంగీత, డ్రగ్ కంట్రోలర్ డీజీ అవినాష్ మహంతి పాల్గొన్నారు.






