26 February, 2026 | 2:54 AM

లక్ష్యానికి చేరువలో రుణాల పంపిణీ

26-02-2026 01:17 AM

కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్, ఫిబ్రవరి 2౫ (విజయక్రాంతి): రుణాల పంపిణీలో లక్ష్యానికి చేరువలో ఉన్నామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. జిల్లా కేంద్రంలోని కేడీసీసీబీ సమావేశం మందిరంలో బ్యాంకర్లు, జిల్లా అధికారులతో రైతులకు రుణాల పంపిణీ, స్వయం సహాయక సంఘాల రుణాలు, రికవరీ, పీఎం జి.పి.వై. రుణాలు, ఎస్సీ, బిసి, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖల పథకాలకు సంబంధించి రుణ లక్ష్య పురోగతి పై డి.సి.సి, డి.ఎల్.ఆర్.సి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు 84.55% రుణాలను పంపిణీ చేసినందుకు బ్యాంకర్లందరినీ జిల్లా కలెక్టర్ అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ ఆర్థిక మద్దతు పథకాల లక్ష్యసాధనకు రుణాలు అందించడంలో బ్యాంకర్లు పూర్తిస్థాయిలో సహకరించాలని బ్యాంకర్లను కోరారు.

వివిధ ఆర్థిక మద్దతు పథకాలకు సంబంధించి వంద శాతం లక్ష్యసాధనకు బ్యాంకర్లు, ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.  2025-26 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 2025 నుండి డిసెంబర్ 2025 నెల వరకు 11358.47 కోట్ల రుణాలను మంజూరు చేసినట్లు తెలిపారు.

ఇందులో భాగంగా వ్యవసాయం మరియు వ్యవసాయ అనుబంధ రంగాలకుగాను 4665.81 కోట్లు, ఎంఎస్‌ఎంఈ రంగంలో 2329.25 కోట్లు, విద్యా రుణాలకు 14.52 కోట్లు, హౌసింగ్ లోన్స్ 161.52 కోట్లు, మహిళ సమాఖ్య గ్రూపులకు 918.38 కోట్లు, ఇతర రంగాలకు సంబంధించి 3268.99 కోట్ల రుణాలను మంజూరు చేసినట్లు తెలిపారు. అర్హులైన రైతులు అందరికీ రుణాలు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఎల్డిఎం ఆంజనేయులు, ఆర్బఐ ఎల్ డి ఓ యశ్వంత్, డిడిఎం ఎస్ జయ ప్రకాష్, ఎస్బిఐ ఏజీఎం వెంకటేష్, టీజీబీ ఆరం బాల నాగు, కెడీసీసీబీ సీఈవో సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.