9 May, 2026 | 6:53 AM

జూలై నుంచే రుణమాఫీ

23-06-2024 12:40 AM
  1. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడంలో వెనక్కి తగ్గం
  2. ఇందిరమ్మ ఇండ్లతో అతిపేదవారికి ముందు లబ్ధి
  3. రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి స్పష్టం 

ఖమ్మం , జూన్ 22 (విజయక్రాంతి): పేదలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రేవంత్‌రెడ్డి సర్కార్ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, ఎన్నికల సమయంలో ఏ హామీలను ఇచ్చామో వాటన్నింటినీ విడతల వారీగా నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టంచేశారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మోటాపురం, శంకరగిరి తండా, రాజేశ్వరపురం, అమ్మగూడెం, కోరట్లగూడెం, కోనాయిగూడెం, అరెగూడెం, ఆచార్లగూడెం, బోదులబండ, మండ్రాజుపల్లి తదితర గ్రామాల్లో శనివారం  మంత్రి పర్యటించారు.

ఆయనకు ఆయా గ్రామాల ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాలు అందజేశారు. ప్రజల సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ ఒకేసారి  అమలు చేయనున్నట్టు స్పష్టంచేశారు. ఇందిరమ్మ రాజ్యంలో వచ్చే నెల జూలై నుంచి రుణమాఫీ అమలవుతుందని తెలిపారు. రూ.31 వేల కోట్లతో రైతుల రుణమాఫీ అమలవుతుందని వెల్లడించారు.

ప్రభుత్వం చేయబోయే రుణమాఫీని తట్టుకోలేక ప్రతిపక్ష నాయకులు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఎద్దేవాచేశారు. అతిపేదవాళ్లకే ముందు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు. లిఫ్ట్‌లు మరమ్మతు చేయించి రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. రాజేశ్వరపురం గ్రామంలో నేలకొండపల్లి మండల కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.  ఆయా కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు నెల్లూరి భద్రయ్య, గోవిందరావు, చెరువు స్వర్ణ, దండ పుల్లయ్య, సీతారాములు తదితరులు పాల్గొన్నారు