కేంద్ర బడ్జెట్‌పై సన్నాహక సమావేశం
- తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం భట్టి హాజరు
- జీఎస్టీ సహా ఇతర అంశాలపై సలహాలు
- రాష్ట్రాలకు సహకరిస్తామన్న నిర్మలా సీతారామన్
హైదరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి) : నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఫుల్ బడ్జెట్‌పై కసరత్తు ప్రారంభించింది. జులైలో ప్రవేశపెట్టబోయే పద్దుపై సూచనలను కోరేందుకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో శనివారం దిల్లీలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులతో ప్రీ బడ్జెట్ సంప్రదింపుల సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌కు తెలంగాణ తరఫున డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సహా గోవా, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం ముఖ్యమంత్రులు, బీహార్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్ నుంచి ఉప ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు హాజరయ్యారు.
కేంద్రం నుంచి రావాల్సిన జీఎస్టీ బకాయిలను విడుదల చేయాలని, సాగునీటి ప్రాజెక్టు లకు మద్దతుగా నిలవాలని, ఫైనాన్స్ కమిషన్ నిధులను సకాలంలో మంజూరు చేయాలని, ఆశా, అంగన్‌వాడీ వర్కర్ల వేతనాలు పెంచాలని, హౌసింగ్ పథకంలో భాగంగా అర్బన్, రూరల్‌లో కేంద్రం వాటాను పెంచాలని తెలంగాణ సహా పలు రాష్ట్రాలు కేంద్ర మంత్రిని కోరాయి. అలాగే తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను మంత్రి భట్టి.. నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లారు.
రాష్ట్రాలకు సహకరిస్తాం: ఆర్థిక మంత్రి
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. రాష్ట్రాల అభివృద్ధికి అన్ని విధాలా సహకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సకాలంలో పన్ను పంపిణీ, ఫైనాన్స్ కమిషన్ మంజూరు, జీఎస్టీ బకాయిల చెల్లింపు అంశాలను పరిశీలిస్తామన్నా రు. మూలధన పెట్టుబడుల విషయమై అందించే ప్రత్యేక సాయం రాష్ట్రాల అభివృద్ధిని వేగవంతం చేస్తుందని నిర్మల సీతారామన్ అభిప్రాయపడ్డారు. ఎలాంటి షరతులు లేకుం డా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం చాలా రుణాలను అందజేస్తోందని ఆర్థిక మంత్రి తెలిపారు. ఇందులో కొంత భాగం ప్రజల జీవితాలను మెరుగుపరచడం, పలు రంగాల ఆధారిత ప్రాజెక్టులను ప్రోత్సహించే అంశాల ముడిపడి ఉన్నాయన్నారు. కేంద్ర మార్గదర్శకాలను అనుసరించి.. ఈ రుణాల ప్రయోజనాలను పొందాలని ఆమె రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారు. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తేవడాని కి రాష్ట్రాలు ఒప్పుకోవాలని పేర్కొన్నారు.






