కూరగాయలు భగ్గు!
సెంచరీ దాటిన టమాట, పచ్చిమిర్చి ధరలు.. --ఏదైనా కిలో రూ.80కి పైమాటే
- మండుతున్న ఆకుకూరలు
- పెరిగిన ధరలతో ఆందోళన
- కారంపొడే దిక్కంటున్న పేద, మధ్యతరగతి కుంటుంబాలు
విజయక్రాంతి నెట్‌వర్క్, జూన్ 22: పెరుగుతున్న కూరగాయల ధరలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. పదిహేను రోజుల క్రితం వరకు ఉన్న ధరలు ఒక్కసారిగా రెట్టింపు కావడంతో సామాన్యుడు ధరలు చూసి బెంబేలెత్తిపోతున్నాడు. ధరలు అంతకంతకూ పెరిగిపోవడంతో కూరగాయలు కొనే పరిస్థితి కన్పించడం లేదు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు కారం పొడే దిక్కులా కన్పిస్తోంది. ఎండాకాలం వెళ్లి వర్షాకాలంలోకి అడుగు పెడుతున్న క్రమంలో అకాల వర్షాలు, గాలివాన బీభత్సం, వడగండ్లు కూరగాయల పంటలపై ప్రభావం చూపు తున్నాయి. దీంతో కూరగాయల ధరలు పెరిగి వ్యాపారితో బేరం ఆడేందుకు వినియోగదారులు జంకుతున్నారు. ధరలు చూసి కొందరు మార్కెట్‌కు వెళ్లడం కూడా మానేశారు. ధరలు తగ్గేవరకు కూరగాయలు కొని తినే పరిస్థితులు కన్పించడం లేదని మధ్య తరగతి కుటుంబాలు చెబుతున్నారు.
మార్కెట్‌లో కనిపించే ఏ కూరగాయల ధరను అడిగినా కిలో రూ. 80కి పైమాటే చెబుతున్నారు. నిత్యం వంటకాల్లో వాడుకునే మిర్చి ధర అమాంతం కిలో రూ.120కి చేరగా, టమాట కిలో రూ.100పైబడే పలుకుతోంది. కూరగాయలతో పాటు ఆకు కూరల ధరల పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. ఆకుకూరలు ఏది కొన్నా కిలో రూ.100కి పైబడే పలుకుతున్నాయి. గతంలో కిలో రూ.20 నుంచి 30 ఉన్న కూరగాయల ధరలు ప్రస్తుతం రూ.100కు చేరాయి. ఉల్లిగడ్డ కిలో రూ.60 దాటింది. వంకాయ రూ.80, క్యాప్సికం, కాకరకాయ రూ.80, బెండకాయ రూ.80, అలసంద రూ.80, గోరుచిక్కుడు రూ.80, క్యాబేజీ రూ.80, దొండకాయ రూ.80, సొరకాయ రూ.60 లకు ప్రస్తుతం మార్కెట్‌లో అమ్ముతున్నారు.
పప్పులపైనే హైదరాబాదీల ఆధారం
హైదరాబాద్‌లోనూ కూరగాయాల ధరలు విపరీతంగా మండిపోతున్నాయి. పౌష్టికాహారానికి ప్రతి రోజూ వినియోగించే కూరగాయాలను సామాన్యులు కొనుగోలు చేయడమే మానేస్తున్నారు. అధిక ధరలతో కూరగాయాలు కొనుగోలు చేయాల్సి వస్తే ఇంట్లో ఇతర అవసరాలు సర్దుబాటు చేసుకోవడానికి బడ్జెట్ కేటాయింపులు తలకిందులవుతున్నాయి. అత్యధిక శాతం పప్పులపైనే ఆధారపడుతున్నారు. తరుచూ వర్షాలు కురుస్తుండటంతో కూరగాయాల రవాణాలో గతం కంటే చాలా తక్కువ మార్కెట్‌కు చేరుకోవడం, ట్రాన్స్‌పోర్టు ధరలు పెరుగుతుండడమే ఇందుకు కారణంగా తెలుస్తున్నది. ఉల్లిగడ్డలు రూ.100 లకు 4 కిలో లు, 5 కిలోలు చొప్పున విక్రయాలు చేసే వ్యాపారులు ఇప్పుడు 2 కిలోల ఉల్లి గడ్డలు రూ. 100ల ధర పలుకుతుంది. రూ.20 లకు పాలకూర 4 కట్టలు ఇచ్చే వ్యాపారులు ఇప్పుడు 2 కట్టలు మాత్రమే ఇస్తున్నారు.

అంగట్ల ఏం కొనేటట్టు లేదు
ధరలను చూస్తాంటే అంగట్లకు పోయి కూరగాయలు కొనే టట్టు లేదు. ఏ కూరగా యను అడిగినా ఎనభై, వంద రూపాయల కంటే ఎక్కువనే చెప్తాండ్లు. రూ.౧౦౦ తీసుకుపోతే రెండు రకాలు కూడా వస్తలేవు. ధరలను చూసి పచ్చళ్లు, కారం తోనే కాలం వెల్లదీస్తాన్నం. ౧౫ రోజుల క్రితం వరకు రేట్లు అగ్గువే ఉండే. ఒక్కసారిగా రేట్లు డబుల్ పెరిగిన య్. కూలీపని చేసుకుని బతికె టోళ్లం. రోజు వంద రూపాయలు పెట్టి కూరగా యలు కొని తినే పరిస్థితులు లేవు.
గుండు గున్నమ్మ, కూలీ, మహాముత్తారం జయశంకర్ భూపాలపల్లి
ఇలా అయితే ఎలా కొంటారు?
ప్రతీ రోజూ పది నుంచి రూ.20 వరకు కూరగాయల ధరలు పెరిగిపోతున్నాయి. నియంత్రించాల్సిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ముందస్తుగా కూరగాయాల సాగు అధికంగా ప్రోత్సహిస్తే బాగుంటుం ది. కిలో టమాట కూడా కొనుగోలు చేయ ని పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు స్పందించి కూరగాయాల ధరలు తక్కువగా అయ్యేలా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం స్పందించి రేట్లు తగ్గించాలి.
మున్నురు సరోజ, జూలపల్లి, మహబూబ్‌నగర్ జిల్లా
టమాట ధరలు ఆకాశాన్ని అంటాయి
టమాట ధర కిలో వంద రూపాయిలు పలుకుతుంది. ఎప్పు డూ కూడా ఇంత ధర చూడలేదు. పంటలు సాగు చేయకపోవడం వల్లనే ధరలు పెరిగాయని కూరగాయల వ్యాపారులు అం టున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలు టమాటను కొనడం లేదు. ఏ కూరగాయ ధరలు చూసిన ఆకాశాన్ని అంటే విధం గా ఉన్నాయి. ధరల నియంత్రణ చేపట్టాలి.
నాగరాజ్‌గౌడ్,
మందాపూర్, కామారెడ్డి జిల్లా
పేదలకు కూరగాయల ధరలు అందుబాటులో లేవు
కూరగాయల ధరలను చూసి పేదలు అమ్మో అని అంటున్నారు. ఎన్నడు కూడా ఇలాంటి ధరలు లేవు. గతేడాదిలో కొన్ని కూరగాయల ధరలు మాత్రమే పెరిగాయి. ఈసారి అన్ని కూరగాయల ధరలు పెరిగి, పేదలు కొనేందుకు జంకుతున్నారు. కూరగాయల ధరలు పేద ప్రజలకు అందుబాటులో ఉంటేనే మేలు.
నర్సారెడ్డి, రైతు,
ఎండ్రియాల్, కామారెడ్డి జిల్లా
ఏం కొనేటట్టు లేదు
మార్కెట్‌కు వెళ్తే కూరగాయల ధరలు మండుతున్నాయి. ఏం కొనే పరిస్థితి లేదు. ఇంత కు ముందు రూ. 300 ఖర్చు చేస్తే సంచి నిండా కూరగాయలు వచ్చేవి. పెరిగిన ధరలతో రెండు, మూడు రకాల కూరగాయలు కూడా రావడం లేదు. కొత్తిమీర రేటు కూడా అమాంతంగా పెరిగింది.
కుమారస్వామి, వ్యాపారి
పావు కిలో కొంటున్నాం
ఇంతకుముందు కిలో కూరగాయల చొప్పున కొనేవాళ్లం. ఇప్పుడు పెరిగిన ధరలతో పావుకిలో కొనాల్సిన పరిస్థితి. పెద్ద కుటుంబం కావడంతో పావు కిలో సరిపోవడం లేదు. రెండు, మూడు రకాల కూరగాయలు కొనాలంటే రూ.150 నుంచి రూ.200 వరకు ఖర్చవుతోంది. పరిస్థితి ఇలాగే ఉంటే సామాన్యుడి బతకడం కష్టం.
అజయ్, సెలూన్ షాప్ యాజమాని, హనుమకొండ






