వర్ష నష్ట ప్రాంతాలను పరిశీలించిన మంత్రి, ఎంపీ
మందమర్రి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో శనివారం ఈదురు గాలులతో కూడిన వర్షాల కారణంగా చెట్లు విరిగి నష్టం సంభవించగా ఆ ప్రాంతాలను రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి (Gaddam Vivek Venkata Swamy), పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ (Gaddam Vamshi krishna)లు తిరిగి పరిశీలించారు. మందమర్రి పట్టణంలోనీ దీపక్ నగర్, పాలచెట్టు, 2వ జోన్‌లో కాంగ్రెస్ నాయకుడు గడ్డం శ్రీనివాస్ నివాసం వద్ద జరిగిన నష్టాన్ని పరిశీలించారు.
అలాగే సరస్వతి స్కూల్‌పై చెట్లు పడటంతో దెబ్బతిన్న భవన భాగాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. బాధితులతో మాట్లాడి జరిగిన నష్టం వివరాలను తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు. వర్షాల వల్ల ప్రభావితమైన ప్రాంతాల్లో సహాయ చర్యలను వేగవంతం చేయాలని, విరిగిపడిన చెట్లను తొలగించి ప్రజలకు రాకపోకల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు.






