అయ్యగారి చెరువు సుందరీకరణ కోసం, రాత్రి, పగలు శ్రమించి పనులు పూర్తి చేయాలి
మంథనిలో అయ్యగారు చెరువు పరిశీలనలో మంత్రి శ్రీధర్ బాబు
మంథని,(విజయక్రాంతి): మంథని పట్టణంలోని అయ్యగారి చెరువు సుందరీకరణ పనులను రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదివారం పరిశీలించారు. చెరువులో జరుగుతున్న అభివృద్ధి పనులను క్షుణ్ణంగా పరిశీలించిన మంత్రి, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, "మంథని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అయ్యగారి చెరువును అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలని, పనులలో ఎటువంటి జాప్యం ఉండకూడదని, నిర్ణీత గడువులోగా పనులు పూర్తవ్వాలంటే, అవసరమైతే రాత్రి, పగలు శ్రమించి పనులను వేగవంతం చేయాలని" అధికారులను ఆదేశించారు.
నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని ఆయన స్పష్టం చేశారు. ఈ పనులు త్వరగా పూర్తయితే పట్టణ వాసులకు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.






