ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు బెల్లంపల్లి సమస్యలు
- ఉపముఖ్య మంత్రికి చైర్ పర్సన్ దావస్వాతి వినతి..
బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలో పర్యటిస్తున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క కు బెల్లంపల్లి మునిసిపాలిటీ మౌలిక సమస్యలను విన్నవించారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి మునిసిపల్ చైర్ పర్సన్ దావస్వాతి ఉప ముఖ్య మంత్రి భట్టివిక్రమార్కను కలసి వినతి పత్రం అందచేశారు. మునిసిపాలిటీ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, బెల్లంపల్లి అభివృద్ధికి ఆటంకంగా ఉన్న సమస్యల్ని తీర్చాలని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్కను కోరారు.
విన్నవించినా సమస్యలు...
1. సింగరేణి క్వార్టర్ల స్థలాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం అవకాశం ఇవ్వాలి.
బెల్లంపల్లి ప్రాంతంలో సింగరేణికి సంబంధించిన అనేక నివాస గృహాలు 50-60 సంవత్సరాల క్రితం నిర్మించారు. ప్రస్తుతం అవి పూర్తిగా శిథిలావస్థకు చేరుకొని నివాస యోగ్యంగా లేవు. లబ్ధిదారులు పాత ఇళ్లను తొలగించి అదే స్థలంలో ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకునేందుకు ప్రయత్నిస్తుండగా సింగరేణి యాజమాన్యం అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని, ఇలాంటి నిర్మాణాలకు ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా సింగరేణి యాజమాన్యానికి తగిన ఆదేశాలు జారీ చేయవలసిందిగా కోరుతున్నాము.
2. సింగరేణి రహదారుల సమస్య
బెల్లంపల్లి పట్టణంలో సింగరేణి ఆధీనంలోని కొన్ని రహదారులు ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ముఖ్యంగా సింగరేణి స్టోరేజ్ ప్రాంతం సమీపంలో ఉన్న రహదారిని సుమారు 20 అడుగుల మేర లోపలికి జరిపి, ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా మార్గాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయమై సింగరేణి యాజమాన్యంతో సమన్వయం చేసి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించవలసిందిగా కోరుతున్నాము.
3. జి.ఓ. ఎం.ఎస్. నెం.76 ప్రకారం సింగరేణి క్వార్టర్ల స్థలాల క్రమబద్ధీకరణ ఇళ్ల పట్టాల మంజూరు గతంలో ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ. ఎం.ఎస్. నెం.76 ప్రకారం సింగరేణి క్వార్టర్ల ప్రాంతాలలో నివాసం ఉంటున్న అర్హులైన కుటుంబాలకు స్థలాలను క్రమబద్ధీకరించి (Regularization) ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం జరిగింది. అదే విధంగా ప్రస్తుతం బెల్లంపల్లి నియోజకవర్గ పరిధిలో సింగరేణి క్వార్టర్ల స్థలాలలో నివసిస్తున్న అర్హులైన కుటుంబాలకు కూడా జి.ఓ. ఎం.ఎస్. నెం.76 స్ఫూర్తితో స్థలాలను క్రమబద్ధీకరించి,
ఇళ్ల పట్టాలు మంజూరు చేయుటకు అవసరమైన చర్యలు చేపట్టవలసిందిగా కోరుతున్నాము. దీనివల్ల వేలాది పేద మధ్యతరగతి కుటుంబాలకు శాశ్వత నివాస హక్కు కల్పించబడటంతో పాటు సామాజిక, ఆర్థిక భద్రత కూడా లభిస్తుంది. కావున ఈ మూడు ప్రజా సమస్యలను అత్యవసరంగా పరిశీలించి, సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేసి త్వరితగతిన పరిష్కారం కల్పించవలసిందిగా మునిసిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్కను కోరారు.






