calender_icon.png 15 January, 2026 | 4:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లోగుట్టు పెద్దోళ్లకెరుక

15-01-2026 02:00:05 AM

  1. మంత్రి, మహిళా ఐఏఎస్‌పై మీడియా కథనాలపై లోతుగా చర్చ 
  2. సిట్‌వేసి, అరెస్టు చేసి.. నెక్ట్స్ ఏంటి?.. సర్కారు తీరు కంటి తుడుపు చర్యేనా? 
  3. సహచర మంత్రులు, సహచర మహిళా అధికారుల నుంచి కానరాని మద్దతు 
  4. రాష్ట్ర రాజకీయాల్లో అంతర్గత కుట్రకోణంపై అనుమానాలు
  5. చానెల్, వెబ్, యూట్యూబ్ ఛాన్నెళ్లపై చర్యలు శూన్యం 
  6. స్పందన లేని మహిళా కమిషన్ 

హైదరాబాద్, జనవరి 14 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఇప్పుడు ఎవరి నోటి వెం ట విన్నా.. ఎక్కడ చూసినా మంత్రి, మహిళా ఐఏఎస్ అధికారులపై కొన్ని ఛాన్నెళ్లు, వెబ్, యూట్యూబ్ ఛానెళ్లు ప్రసారం చేసిన కథనంపైనే చర్చ నడుస్తోంది. దీనిపై అటు మం త్రితోపాటు.. ఇటు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సంఘాలు ఖండించి, సెంట్రల్ క్రైం స్టేషన్‌లో చేసిన ఫిర్యాదు ఆధారంగా ముగ్గు రు జర్నలిస్టులను కూడా అరెస్టు చేశారు. అయితే ఈ కథనం వెనుక అసలు ఆంతర్యం ఏమిటి?.. ఈ కథనం తరువాత ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు.. ఇతర సంస్థలు, మహి ళా సంఘాలు, మహిళా కమిషన్ నుంచి ఎలాంటి స్పందన కూడా రాకపోవడం చూ సిన ప్రజలు.. ‘లోగుట్టు పెద్దోళ్లకెరుక’ అం టూ వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రజల నుంచి, సంస్థల నుంచి వెళ్లువెత్తుతున్న ప్రశ్నలు, అనుమానాలను పరిశీలిస్తే.. మనం కూడా ‘లోగుట్టు పెద్దోళ్లకెరుక’ అనకుండా ఉండలేమేమో!

అంతర్గత కుట్రకోణం ఉందా..?

వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నల్లగొండ జిల్లా నుంచి మంత్రివర్గంలో మరో బెర్తుకోసం అధిష్ఠానం వద్ద గట్టిగా పట్టుబడుతున్న నాయకు డి గురించి అందరికీ తెలిసిందే. తనకు మంత్రిగా అవకాశం ఇస్తామని అధిష్ఠానమే హామీ ఇచ్చిందని.. ఆ హామీని నిలుపుకోవాలనే హెచ్చరికలు బహిరంగంగానే ప్రజలు వింటున్నారు. అయితే నల్లగొండ జిల్లా నుంచి ఇప్పటికే ఇద్దరికి మంత్రివర్గంలో చోటు దక్కింది. మరొకరికి స్థానం అనేసరికి.. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల గొంతులో వెలక్కాయలా మారింది.

ఈ నేపథ్యంలోనే ఉన్న ఇద్దరిలో ఒకరిని సాగనంపితే.. ఇంకొకరికి అవకాశం ఇవ్వొచ్చనే కుట్రకోణం తాజాగా ఎలక్ట్రానిక్ చాన్నెళ్లు, సోషల్ మీడియాలో వచ్చిన మంత్రి, మహిళా ఐఏఎస్ కథనం వెనుక ఉందనే చర్చ మాత్రం రాజకీయ విశ్లేషకుల్లో జరుగుతోంది. అదే నిజమనుకుం టే.. సాధారణంగా సాగనంపితే సరిపోతుం ది. కానీ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా కథనాలను తెరవెనుక వండించి ప్రసారం చేయ డం.. ఆపై సాక్షాత్తు ఆ మంత్రి తీవ్రంగా మానసిక క్షోభకు గురికావడం చూస్తే.. ‘నేను ఇక చేయలేను.. నన్ను వదిలేయండి’ అనేలా ఆయనతోనే మాట్లాడించి.. ఆపై రాజకీయ బెర్తును భర్తీచేసేలా కుట్ర దాగి ఉందేమో..? అనే చర్చకూడా సాగుతోంది.

పైగా ఈ సంఘటన జరిగిన తరువాత.. ‘నన్ను మరింతగా చంపకండి... ఇంత విషం ఇచ్చి చంపం డి’ అంటూ ఆవేదనతో సదరు మంత్రి మా ట్లాడినట్టుగా మాటలు బయటకు వచ్చాయి. అంటే అందరూ అనుమానిస్తున్నట్టుగా.. కుట్ర కోణంలో భాగంగానే ఈ సంఘటన జరిగి ఉంటే.. ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే ఇది జరిగి ఉంటుందని.. సదరు ఛాన్నెళ్లకు తెరవెనుక ఆశీస్సులు కూడా ఉండి ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అనుమాని స్తున్నారు.

కంటితుడుపు చర్యలేనా..?

మంత్రి, మహిళా ఐఏఎస్‌లపై ప్రసారం అయిన కథనం నేపథ్యంలో వారి వ్యక్తిత్వ హననానికి పాల్పడటంపై రాష్ట్రంలో తీవ్ర చర్చ జరిగింది. మీడియాకు హద్దులు ఉండాలని, ఎలాంటి సాక్ష్యాలు కూడా లేకుండా వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా కథనాలు వండి వార్చవద్దనే డిమాండ్ వినప డింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం ఐఏఎస్, ఐపీఎస్ సంఘాల నుంచి అందిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసింది. ప్రత్యేక విచారణ బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. తాజాగా ఈ కథనానికి కారకులం టూ.. ముగ్గురు జర్నలిస్టులను మాత్రం పోలీసులు అరెస్టు చేశారు.

కానీ కథనాలను ప్ర సారం చేసిన ఛాన్నళ్లపై ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. కనీసం ప్రభుత్వం విడుదల చేసే ప్రకటనలను కూడా సదరు ఛాన్నళ్లకు నిలిపివేయలేదు. సోషల్‌మీడియా వెబ్ ఛాన్నళ్లు, యూట్యూబ్ ఛాన్నళ్లపై ఎలాంటి చర్యలూ లేవు. కేవలం జర్నలిస్టులను మాత్రం పావులుగా చేసి అరెస్టు చేసి, చేతులు దులుపుకున్నారా? అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ కథనం ప్రసారం వెనుక కుట్రకోణం లేకపోతే.. వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే కథనాలను ప్రచారం చేసిన ఛాన్నళ్లపై చర్యలు తీసుకోకుండా.. కేవలం జర్నలిస్టులను ఎలా బాధ్యు లుగా చేస్తారనే ప్రశ్నలూ వినవస్తున్నాయి. అంటే ప్రభుత్వం కేవలం కంటితుడుపుగా మాత్రమే వ్యవహరిస్తోందా..? అనే అనుమానాలు కూడా బలంగా వ్యక్తమవుతున్నాయి.

మంత్రి, మహిళా ఐఏఎస్‌లకు మద్దతు ఏదీ?

వాస్తవానికి మంత్రి, మహిళా ఐఏఎస్‌లపై ప్రసారం అయిన కథనం పూర్తిగా వారి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేదిగానే చాలా మంది ప్రముఖులు కండిస్తూ వచ్చారు. అయితే అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే.. సదరు మంత్రి సహచరులు అయిన మంత్రుల నుంచి మాత్రం ఈ సంఘటనపై చెప్పుకోదగ్గ మద్దతు కనపడటం లేదు. ఇతర మంత్రులెవరూ గట్టిగా దీనిపై స్పందించడం లేదనే విమర్శలు ఉండనే ఉన్నాయి.

అదే సమయంలో ఒక మహిళా ఐఏఎస్ వ్యక్తిత్వ హననానికి సం బంధించిన కథనం ప్రసారం అయినా.. ఇత ర మహిళా ఐఏఎస్‌లు, గ్రూప్ 1 స్థాయి అధికారులు, ఇతర మహిళా అధికారుల్లోనూ ఎలాంటి చలనమూ లేదు. కండించడమూ లేదు. బహిరంగంగా బయటకు వచ్చి ఫిర్యా దు చేసింది కూడా లేదు. ఇంతగా వ్యక్తిత్వ హననం జరిగినా.. మహిళా ఐఏఎస్‌లు, ఇతర మహిళా అధికారులే బయటకు రావడానికి ఇంతగా భయపడితే.. సామాన్య మ హిళల సంగతేమిటి..? వారికెవరు భరోసా ఇస్తారనే ప్రశ్న ఉదయించకమానదు. 

మహిళా కమిషన్ స్పందనేది?

ఇంత ఘోరంగా, నైతికతను పక్కనపెట్టి మహిళా అధికారిణి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా కథనాన్ని ప్రసారం చేసినా.. రాష్ట్రంలోని మహిళా కమిషన్ ఏం చేస్తుందనే ప్రశ్నను పలువురు లేవనెత్తుతున్నారు. మొన్నటికి మొన్న.. సినీనటుడు శివాజీ మంచి దుస్తులు వేసుకోవాలనే విధంగా హితోక్తిగా చెప్పిన మాటలను పట్టుకుని.. సుమోటోగా కేసు నమోదుచేసి, నోటీసులు జారీచేసిన మహిళా కమిషన్.. ఈ సంఘటన విషయంలో ఎందుకు స్పం దించడం లేదనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

సాక్షాత్తు మహిళా ఐఏఎస్ అధికారిణి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా కథనం ప్రసారం చేసినా.. దీనిపై మహిళాకమిషన్ సదరు ఛాన్నళ్లు, సోషల్ మీడియా యాజమాన్యాలకు ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదనే దానిపైనా ప్రజల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో ఇంత పెద్దయెత్తున చర్చనీయాంశమైన సంఘటన విషయంలో మహిళా కమిషన్ స్పందించకపోవడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది.

ఇలా ఏ కోణంలో చూసుకున్నా.. అంశాల వారీగా పరిశీలించినా.. కొన్ని అసంపూర్తి సమాధానాలే కనపడుతున్నా యి. స్పందించాల్సిన వారు స్పందించడం లేదు.. ఏదో కంటితుడుపుగా చర్యలున్నాయి.. లోతుగా ఆలోచిస్తే.. రాష్ట్ర అధికార పార్టీ రాజకీయాల్లో అంతర్గతంగా ఏదో జరుగుతుందనే అనుమానాలు మాత్రం బలంగా వినపడుతున్నాయి.. ఎన్ని రకాలుగా చర్చిస్తున్నా.. తిరిగి.. తిరిగి.. పెద్దోళ్ల దగ్గరికే వచ్చి ఆగిపోతున్నాయి. అందుకే ‘లోగుట్టు పెద్దోళ్లకెరుక’.