రూ.196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్, సాధారణ కౌన్సిల్ సమావేశాల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్
ఖమ్మం, మార్చి -18(విజయ క్రాంతి): 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ అధ్యక్షతన నిర్వహించిన బడ్జెట్, సాధారణ కౌన్సిల్ సమావేశాల్లో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ హైదరాబాద్ తర్వాత అత్యంత ముఖ్యమైన కార్పోరేషన్ ఖమ్మం మాత్రమేనని అన్నారు. 196 కోట్లతో 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని, ఈ నిధులతో నగరవాసులకు మెరుగైన సేవలు అందాలని కలెక్టర్ ఆకాంక్షించారు. కార్పోరేషన్ లో ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో మంచి సంస్కరణలు తీసుకొని వచ్చి చాలా సమస్యలు క్షేత్రస్థాయిలో పరిష్కరించి నందుకు కలెక్టర్ అభినందనలు తెలిపారు.
కార్పోరేషన్ ప్రతి రోజు పని ఉంటుందని, చెత్త సేకరణ, డ్రైయిన్ క్లీన్ చేయడం, స్ట్రీట్ లైట్ నిర్వహణ, నీటి సరఫరా వంటి పనులు నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంటుందని అన్నారు. ఏప్రిల్ మొదటి వారం నాటికి ఖమ్మం జిల్లా పరిధిలో 10 వేల ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం పూర్తి అవుతాయని కలెక్టర్ తెలిపారు. నగర వ్యాప్తంగా ఉన్న గుంతలను పూడ్చి వేసినందుకు మున్సిపల్ సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
బైపాస్ రోడ్డు వద్ద ప్రమాదాల నియంత్రణకు అవసరమైన చర్యలు పూర్తి చేశామని అన్నారు. నగర పరిధిలో 2 కోట్ల 50 లక్షలతో ముఖ్యమైన రహదారుల విస్తరణ పనులు చేపట్టామన్నారు. ఈ సంవత్సర కాలంలో 23 కిలోమీటర్ల మేర సిసి రోడ్లు, 18 కిలోమీటర్ల సిసి డ్రెయిన్ల నిర్మాణం చేపట్టామన్నారు. అమృత్ పథకం క్రింద 229 కోట్లతో చేపట్టిన మంచినీటి సరఫరా పనులు తుది దశలో ఉన్నాయన్నారు.
బడ్జెట్ 2026-27 అంచనాలను సభకు నగరపాలక సంస్థ పరిపాలన అధికారి సిహెచ్. శ్రీనివాస్ వివరించారు. పన్నుల వనరుల క్రింద 50.43 కోట్లు, పన్నేతర వనరుల ద్వారా 96.94 కోట్లు, డిపాజిట్లు, అడ్వాన్స్ ల ద్వారా 7.90 కోట్లు, మొత్తంగా 104.84 కోట్ల ఆదాయ అంచనా ఉందన్నారు. ఖర్చుల క్రింద చారజ్డ్ ఖర్చులు 63.44 కోట్లు, నిర్వహణ ఖర్చులు 18.03 కోట్లు, విలీన గ్రామాలు, పబ్లిక్ ఏమిటెన్స్, వార్డ్ బడ్జెట్ క్రింద 16.01 కోట్లు, డిపాజిట్లు, అడ్వాన్స్ లు, రుణాల క్రింద 7.90 కోట్లు, క్యాపిటల్ ప్రాజెక్ట్ ఫండ్స్ క్రింద 91.02 కోట్లు గా అంచనా వేశారు.
సాధారణ కౌన్సిల్ సమావేశంలో 4రూ. 74.09 కోట్లకు సంబంధించి 22 అంశాలను కౌన్సిల్ ఆమోదం కొరకు నగరపాలక సంస్థ మేనేజర్ జి. శ్రీనివాసరావు సమర్పించారు. ఇందులో 984 మంది అవుట్ సోర్సింగ్ వర్కర్ల వేతనం మునిసిపల్ సాధారణ నిధుల నుండి మంజూరుకు, 20 మంది డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బంది వేతనములు మునిసిపల్ సాధారణ నిధుల నుండి మంజూరుకు ఇద్దరు మునిసిపల్ స్టాండింగ్ కౌన్సిల్ గౌరవ వేతనం మంజూరుకు, నలుగురు టెక్నికల్ అసిస్టెంట్స్ వేతనాలు మంజూరుకు,
ఎన్విరాన్ మెంటల్ ఇంజనీర్ గౌరవ వేతనం మునిసిపల్ సాధారణ నిధుల నుండి మంజూరుకు, ఒక తహసీల్దార్S సేవలు ఔట్ సోర్సింగ్ పద్దతిపై వినియోగించుకొనుటకు, పారిశుద్ధ్య, మల్టిపర్పస్ కార్మికులకు ఒక్కొక్కరికి రూ. 1000 చొప్పున ప్రస్తుత వేతనానికి అదనంగా చెల్లించుటకు, విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన ఔట్ సోర్సింగ్ కార్మికుడు మల్లెపాక శివకుమార్ కుటుంబానికి పరిహారం క్రింద 2 లక్షలు చెల్లింపులు ఉన్నాయి.
నగరంలో పెయిడ్ పార్కింగ్ లు ఏర్పాటు చేయాలన్నారు. తమ తమ డివిజన్లలో సమస్యలను ఈ సందర్భంగా కార్పొరేటర్లు అధికారుల దృష్టికి తెచ్చారు. త్వరితగతిన పరిష్కరించాలని అన్నారు. ఈ సమావేశంలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, కార్పొరేటర్లు, మునిసిపల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.




