పోయిన చోటే వెతుకులాట
బీఆర్‌ఎస్ పార్టీకి పూర్వవైభవం కోసం..
బస్సుయాత్రతో తిరిగి ప్రజల్లోకి వెళ్లిన గులాబీ బాస్
ఉద్యమకాల భాష, యాస ప్రయోగించిన కేసీఆర్
ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం
హైదరాబాద్, మే 13 (విజయక్రాంతి): పార్లమెంటు ఎన్నికల్లో తన ఉనికిని కాపాడుకునేందుకు ప్రతిపక్ష బీఆర్‌ఎస్ శాయశక్తుల శ్రమించింది. ఇప్పుడు సత్తా చాటకపోతే భవిష్యత్తు అంధకారమేనని భావించిన గులాబీ బాస్ కేసీఆర్ జనం బాట పట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా ఘోర ఓటమి చవిచూసిన నేపథ్యంలో పోయిన చోటే వెతకా లన్న సామెతను కేసీఆర్ ఫాలో అవుతున్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక రెండు దఫాల ఎన్నికల్లో నామమాత్రపు ప్రచారం చేసి మెజార్టీ సీట్లలో విజయం సాధించింది బీఆర్‌ఎస్. కానీ, ఈసారి అలాంటి వాతావరణం కనిపించలేదు.
తీవ్రంగా చెమటోడిస్తే తప్ప పరువు కాపాడుకునే మార్గం దొరకలేదు. చివరకు జనంలోకి వెళ్లితేనే ఆదరణ లభిస్తుందని, పేద, మధ్యతరగతి వర్గాలకు దగ్గర కావచ్చనే భావనతో బస్సుయాత్ర చేపట్టిన 13 పార్లమెంటు నియోజకవర్గాల్లో రోడ్ షోలు, కార్నర్‌లు మీటింగ్‌లు నిర్వహించారు. ఉద్యమ కాలం నాటి యాస, భాష వాడి చరిత్రను నెమరు వేసుకుంటూ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నించారు. అధికార కాంగ్రెస్‌పై విమర్శల వర్షం కురిపించారు. ఆర్నెల్లు గడవకముందే ప్రజాపాలన అందించడంతో విఫలమైందంటూ ఆరోపణలు చేశారు. అన్ని వర్గాల అభివృద్ధి కోసం మళ్లీ బీఆర్‌ఎస్‌ను ఆదరించాలని ప్రజలను కోరారు.
ఎదురుదెబ్బలు తగిలినా...
కొన్ని నెలలుగా బీఆర్‌ఎస్‌కు ఎన్నో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తొలుత ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత పేరు రావడం, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, ఆ తర్వాత కవిత అరెస్టులు జరిగాయి. మరోవైపు పార్టీ నేతలు, క్యాడర్ ఒక్కొక్కరుగా బీజేపీ, కాంగ్రెస్‌కు వలస వెళ్లడంతో ఆ పార్టీలో కలవరం మొదలైంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ నిర్వహించిన పొలం బాట, బహిరంగ సభలు, బస్సుయాత్రతో మళ్లీ ప్రజల్లో ఇమేజ్ సంపాదించుకోగలిగారు. 2014 ఎన్నికల్లో 63 అసెంబ్లీ సీట్లతో పాటు 12 పార్లమెంటు స్థానాలు గెలుచుకుంది బీఆర్‌ఎస్.
2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా 88 ఎమ్మెల్యే సీట్లలో విజయం సాధించగా, 2019 లోక్‌సభ ఎన్నిక ల్లో మాత్రం 9 స్థానాలకు పడిపోయారు. తరువాత దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగలగా, హుజూర్‌నగర్, మునుగోడు ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు. అప్పటినుంచే పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగినా కేసీఆర్ పట్టించుకోకుండా తాను ప్రవేశ పెట్టిన పథకాలు విజయతీరాలకు చేరుస్తాయ ని భావించారు. అతి విశ్వాసంతో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సగం మంది అభ్యర్థులు ఓడిపోతారని సర్వేలు చెప్పినా లెక్కచేయకుండా సిట్టింగ్‌లకు ఇవ్వడంతో 55 మంది అభ్యర్థులు చిత్తుగా ఓడిపోయారు.
తదనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. బీఆర్‌ఎస్‌ను ఇరుకున పెట్టేలా అవినీతి, అక్రమాలపై విచారణకు ఆదేశించింది. పెద్ద ఎత్తున విమర్శలు సైత చేసింది. అయినా కేసీఆర్ బయటికి రాలేదు. గెలిచిన ఎమ్మెల్యేల్లో ముగ్గు రు పార్టీకి దూరమైయ్యారు. మరికొందరు కూడా వెళ్లేందుకు ప్రయత్నాలు సాగించారు. అయినా వారిని నిలువరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రేవంత్ సర్కార్ కాళేశ్వరంలో అవినీతి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలికితీయడంతో ప్రజల్లో పార్టీ మరింత పలుచనైంది. కేసీఆర్ మౌనంగా ఉండటంపై పార్టీలో విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి.
పూర్వవైభవం కోసం కృషి..
ఇదే సమయంలో పార్లమెంటు ఎన్నికలు రావడంతో 17 స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువైయ్యారు. ముందుగా సీట్లు ప్రకటించిన చేవెళ్ల అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డి, కడియం కావ్య తమకు టికెట్లు ఇచ్చినా నిరాకరించి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి గులాబీ నేతకు మళ్లీ 14 ఏళ్ల ఉద్యమ చరిత్ర గుర్తు తెచ్చుకుని పాలకులపై సమరానికి కాలు దువ్వారు. తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన నల్లగొండ, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, పాలమూరు, వరంగల్ జిల్లాల్లో విస్తతృంగా పర్యటించి పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు శాయశక్తుల కృషి చేశారు.
బస్సుయాత్రలో భాగంగా రైతులు, కూలీలు, యువకులు, మహిళలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని ఓదార్చారు. ఎన్నికల్లో కేసీఆర్ చేస్తున్న ప్రచారం చూసిన ఆ పార్టీ నాయకులు ఆర్నెల్ల ముందే ఈ కార్యాచరణ ప్రారంభిస్తే మూడోసారి అధికారం చేపట్టి తెలంగాణ చరిత్రలో మరో సువర్ణాధ్యాయం లిఖించుకునే వారమని పార్టీ కార్యకర్తలు పేర్కొంటున్నారు.




