మహాశివా.. మన్నించు
- ప్రమాదకరంగా శ్రీఉమామహేశ్వర ఆలయ సన్నిధి
ప్రధాన ఆలయం.. ప్రహరికి మధ్య ఏర్పడ్డ పగుళ్లు
ముందు భాగం కూలిపోయే ప్రమాదం ఉందని భక్తుల ఆందోళన
నాలుగు రోజులుగా నిలిచిన భక్తుల దర్శనాలు
అప్రమత్తం కానీ దేవాదాయశాఖ.. అధికార యంత్రాంగం
అచ్చంపేట, అక్టోబర్ 31: నిత్యం శివనామ స్మరణతో ప్రతిధ్వనించే ఉమామహే శ్వర ఆలయ పరిసరాలు భక్తుల దర్శనం లే క.. నిశ్శబ్దంగా మారింది. ఇటీవల తెలుగు రాష్ట్రాలను కకావికలం చేసిన మొంథా తుఫా ను.. శివయ్య భక్తులను కలవరపాటుకు గురిచేస్తోంది. తన జటాజూటంలో గంగమ్మను ఒడిసిపట్టే శివయ్య చెంతనే.. కొండపై నుంచి జాలు వారుతున్న నీటిదారలు ప్రమాదకరంగా మారాయి.
నాగర్ కర్నూల్ జిల్లా అ చ్చంపేట మండలంలోని రంగాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని నల్లమల్ల కొండల్లో శ్రీ ఉమామహేశ్వరం ఆలయం ఉంది. క్రి.శ. 1,232లో కాకతీయులు ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. శ్రీశైలం ఉత్తర ముఖ ద్వారంగా బాసిల్లుతోన్న ఆలయాన్ని పార్వతిదేవి శివుని కోసం తపస్సు చేసిన ప్రాంతం కావడంతో శ్రీ’ఉమా’మహేశ్వరం గా పిలుస్తారు.
అర్థ చంద్రకారంగా ఉన్న కొం డపైన ఉన్న తుమ్మెద మామిడి చెట్టు కింద శివుడు కొలువై ఉన్నాడు. ప్రతిరోజు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర లకు చెందిన వేలాది మంది భక్తులు ఆలయాన్ని దర్శించుకుంటారు.
మొంథా తుఫానుతో ప్రమాదకరం
ఇటీవల మొంథా తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఆలయ పరిసరాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఆలయం నుంచి పాపనాశినికి వెళ్లే మార్గంలోని స్నానపు గదుల వద్ద ఉన్న షెడ్ పై పడడంతో భారీగా ధ్వంసం అయింది. ఆ మార్గంలోని పరిసరాలు భారీగా దెబ్బతిన్నాయి. దీంతో ఈనెల 29 నుంచి ఆలయానికి భక్తుల రాక ను నిలిపివేశారు.
ప్రధాన ఆలయం ముందు పగుళ్లు
శ్రీ ఉమామహేశ్వర ప్రధాన ఆలయం ముందున్న ధ్వజస్తంభం వద్ద.. ఆలయానికి ప్రవేశించే మెట్ల మార్గం వద్ద భారీ పగుళ్లు ఏ ర్పడ్డాయి. ఆలయానికి భక్తులు నిలబడే ప్ర హరీకి మధ్య పగుళ్లు వచ్చాయి. అలాగే నిత్య అన్నదాన సత్రం నుంచి ఆలయం వరకు ఏర్పడిన పగుళ్లతో ప్రమాదకరంగా మారిం ది. తొలుత వెంట్రుక మందంతో ఉన్న పగుళ్లు రాను రాను పెద్దగా మారుతున్నట్లు ఆలయ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు.
ఆలయం వద్ద మెట్లు, ధ్వజస్తంభం వద్ద ఆరు ఇంచుల మేరా గ్యాప్ ఏర్పడింది. టికెట్లు ఇ చ్చే గది, ఈవో కార్యాలయం గదుల గోడలు నెర్రలిచ్చాయి. ప్రమాదకరంగా మారి కూలిపోయే అవకాశం ఉండడంతో సిబ్బంది భయాందోళన చెందుతున్నారు. ఆలయం పక్కనున్న మండపం గదిలోనూ నెర్రలిచ్చా యి. ఆలయం ముందున్న ప్రహరీ పరిసరాలు ఏ క్షణమైన కూలిపోయే ప్రమాదం ఉందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అప్రమత్తం కానీ దేవాదాయశాఖ.. అధికార యంత్రాంగం
భారీ వర్షాలు, ఆలయం వద్ద కొండ చరియలు విరిగిపడడంతో అక్టోబర్ 29న ఆల యాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. కానీ నాలుగు రోజులైనా అధికారులు అవసరమై న ముందస్తు చర్యలు చేపట్టలేదని భక్తుల ఆరోపిస్తున్నారు. దీంతో నాలుగు రోజులుగా ఆలయానికి భక్తుల ప్రవేశాన్ని నిలిపివేశారు. ఆలయం వద్ద ప్రమాదకర పరిస్థితులు ఉన్న ఇప్పటికి దేవాదాయ శాఖకు సంబంధించిన ముఖ్య అధికారులు, సాంకేతిక నిపుణులు, ఇంజనీరింగ్ అధికారులు గానీ ఆలయానికి వచ్చి పరిశీలించిన దాఖలాలు లేవు.
ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బీరం మాధవరెడ్డి, ఈవో శ్రీనివాసరావు ఆలయ పరిసరా లను పరిశీలించి సంబంధిత శాఖ అధికారులకు లిఖితపూర్వకంగా నివేదిక అందించా రు. ఆలయ పర్యవేక్షణను నిర్వర్తించాల్సిన ఈవో అధికారులకు నివేదికలు ఇచ్చే పేరుతో విధులకు గైర్హాజరు అవుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. నాలుగు రోజుల వ్యవధిలో కేవలం ఒక్కరోజు మాత్రమే ఆలయానికి వచ్చి వెళ్లిపోయారంటే ఆయన విధి నిర్వహణను అర్థం చేసుకోవచ్చు.
* కార్తీక మాసం.. భక్తుల వేదన
శివునికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం కావడంతో శ్రీ ఉమామహేశ్వర ఆలయానికి భక్తుల రద్దీ అధికంగా ఉండేది. ప్రధానంగా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన వేలాది మంది భక్తులు ఆలయాన్ని దర్శించుకునేవారు. అధికారుల నిర్లక్ష్యంతో వారికి స్వామి సేవలు మృగ్యమయ్యాయి. ఆలయ పరిస్థితి గురించి ఈవో శ్రీనివాసరావును వివరణ కోరగా.. అక్కడ ఏర్పడిన నష్టం తీవ్రతను ఇతర అంశాల గురించి ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా తెలియజేశానని చెప్పారు. స్తపతి, ఇతర అధికారులు ఆలయానికి వచ్చి పరిశీలిస్తారని చెప్పారు.






