31-10-2025 11:45:26 PM
నిర్లక్ష్య వైఖరితోనే రైతాంగం నష్టపోయే పరిస్థితి
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు
చిట్యాల,(విజయక్రాంతి): తడిసిన ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరను రైతులకు చెల్లించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిట్యాల పట్టణ కేంద్రంలో భువనగిరి రోడ్ లో గల ఐకెపి సెంటర్ ని ఆయన శుక్రవారం సందర్శించారు. ఇటీవల నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకొని, వరి ధాన్యాన్ని పరిశీలించారు. తడిసిన ధాన్యానికి కేంద్ర ప్రభుత్వం ఏదైతే మద్దతు ధరను కల్పిస్తుందో, రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే మద్దతు ధరను రైతులకు చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రైతులకు ధాన్యం తడవకుండా ఉండడానికి సరైన టార్పలిన్ కవర్లు ఏర్పాటు చేయడంలోనూ, ధాన్యమును తూర్పార పట్టుటకు ఫ్యాన్లు, సరైన వసతులు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో రైతాంగం అంతా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. కావున వెంటనే రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తడిసిన ధాన్యాన్ని మద్దతు ధర తో కొనుగోలు చేసి రైతుల సమస్యను పరిష్కరించాలని కోరారు. లేని యెడల బిజెపి పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి రైతుల తరఫున పోరాటం చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.