calender_icon.png 19 June, 2025 | 10:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బరువు తగ్గితే.. మధుమేహం దూరం

19-06-2025 01:01:49 AM

- అందుకు అందుబాటులో కొన్ని మందులు

- గర్భంతో వచ్చే మధుమేహంతో జాగ్రత్త

- మధుమేహ అవగాహన వారం సందర్భంగా కామినేని వైద్యుల వెల్లడి

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 18, (విజయక్రాంతి): బరువు తగ్గితే మధుమేహం దానంతట అదే తగ్గుతుందని కామినేని ఆస్పత్రికి చెందిన మధుమేహ వ్యాధి నిపుణులు, ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ సందీప్ రెడ్డి, కన్సల్టెంట్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ భవాని పేర్కొన్నారు. మధుమేహ అవగాహన వారాన్ని ఏటా జూన్ 9 నుంచి 15 వరకు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వారిద్దరూ మీడియాతో మాట్లాడుతూ.. ‘బరువు తగ్గడానికి, మధుమేహ నియంత్రణకు మనదేశం లో ప్రధానంగా మూడు నాలుగు రకాల మందులు ఉన్నాయి.

వాటిలో కొన్ని ఇంజెక్షన్లు, మరికొన్ని మాత్రలు ఉన్నాయి. అవి వాడితే 10 నుంచి -15 కిలోల వరకు బరువు తగ్గుతారు. ఆ మందులు వాడినప్పుడు కడు పు నిండిపోయినట్లు అనిపించి, తినాలన్న కోరిక తగ్గుతుంది. వీటికి యూఎస్‌ఎఫ్డీఏ సహా అన్నిరకాల అనుమతులు ఉన్నాయి. గతంలో ఇవి మన దేశంలో అందుబాటులో ఉండేవి కావు. మధుమేహం లేనివాళ్లకు కూడా బరువు తగ్గడానికి ఇవి వాడుతున్నారు. కొవిడ్‌కు ముందు కేవలం మధు మేహాన్ని నియంత్రణలో పెట్టేవాళ్లం. ఇప్పు డు దానికి మూల కారణం.. అంటే బరువును తగ్గిస్తున్నాం.

అయితే కొన్ని రకాల మందుల ఖర్చు ఎక్కువగా ఉండటంతో అందరూ వాటిని భరించగలిగే పరిస్థితి ఉండట్లేదు. కొంతమంది మాత్రం తీసుకుంటున్నారు. అలాగే, మహిళలకు గర్భం దాల్చినప్పుడు వచ్చే మధుమేహం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దాదాపు 90 శాతం మహిళల్లో ఆ తర్వాత రెండు నుంచి ఐదేళ్లలోపు అది మళ్లీ కొనసాగే ప్రమాదం ఉంటుంది.  ఇప్పుడు 20 ఏళ్లలోపు వారికి కూడా మధుమేహం కనిపిస్తోంది. 40 ఏళ్లలోపు వచ్చిందంటే అది టైప్ 1 కావచ్చు, టైప్ 2 కావచ్చు, జన్యుపరంగా వచ్చింది కావచ్చు, లేదా హార్మోన్ సమస్యల వల్ల కూడా రావచ్చు. అందువల్ల ముందుగా అది ఏ రకమో గుర్తించి, అప్పుడు దానికి అనుగుణంగా చికిత్స చేయాలి’ అని పేర్కొన్నారు.