calender_icon.png 27 July, 2025 | 12:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్‌లో బ్రహ్మోస్ ఏరోస్పేస్‌ను విస్తరించండి

19-06-2025 01:01:47 AM

  1. ఆ సంస్థ ప్రతినిధులను కోరిన సీఎం రేవంత్‌రెడ్డి
  2. డిఫెన్స్ కారిడార్ ఏర్పాటుకు హైదరాబాద్, బెంగళూరు అనుకూలమని వెల్లడి
  3. సానుకూలంగా స్పందించిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ బృందం

హైదరాబాద్, జూన్ 18 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థను విస్తరించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆ సంస్థ ప్రతినిధులను కోరారు. బుధవారం జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థ ప్రతినిధుల బృందం మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ..డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్, బెంగళూరు నగరాలు అత్యంత అనుకూలమైనవని బ్రహ్మోస్ సంస్థ ప్రతినిధులకు వివరించారు. ఇప్పటికే హైదరాబాద్‌లో డిఫెన్స్‌కు సంబంధించి వివిధ సంస్థలు ఉన్నాయని తెలిపారు. దేశంలో పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం ఎంతో అనుకూలమైన ప్రదేశమని సూచించారు.

బ్రహ్మోస్ ఏరోస్పేస్ విస్తరణకు తెలంగాణ, హైదరాబాద్‌ను ఎంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి అన్ని విధాలుగా సహాయ, సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తిపై బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రతినిధుల బృందం సానుకూలంగా స్పందించింది.

సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన వారిలో బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఎండీ, సీఈవో డా.జైతీర్థ్ ఆర్.జోషి, బ్రహ్మోస్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సూరంపూడి సాంబశివప్రసాద్, డీఆర్‌డీఎల్ డైరెక్టర్ జీఏ శ్రీనివాసమూర్తి తదితరులు ఉన్నారు.