ఉరేసుకుని ప్రేమ జంట ఆత్మహత్య
అచ్చంపేట : ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్న జంట కుటుంబ సభ్యులు పెట్టిన వేధింపులు భరించలేక ఇద్దరు భార్యాభర్తలు చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలం జినుకుంట గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. సీఐ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం... జినుకుంట గ్రామానికి చెందిన మహేష్(22) భానుమతి(20) ఇరువురు ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇది ఇరు కుటుంబాలకు నచ్చకపోవడంతో మొదటి నుంచి వేధింపులకు గురి చేసేవారు.
పెద్దలను ఒప్పించి అదే గ్రామంలో ఇరువురు నివాసం ఉంటున్న క్రమంలో శనివారం రాత్రి మహేష్ తండ్రితో గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్థాపానికి గురైన ఆ జంట ఆదివారం తెల్లవారుజామున వారి సొంత పొలంలో చెట్టుకు ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నారు. విషయం తెలుసుకున్న సిఐ రవీందర్ తన సిబ్బందితో కలిసి చేరుకొని పూర్తి వివరాలను సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.






