4 August, 2026 | 6:28 PM

పెళ్లి కార్డులో ప్రకృతి ప్రేమ.. కార్డులోంచి తులసి మొక్క!

04-08-2026 05:19 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): సాధారణంగా పెళ్లి ముగిసిన తర్వాత ఆహ్వాన పత్రికలను పారేస్తుంటారు. అయితే కోనరావుపేట మండలం కనగర్తి గ్రామానికి చెందిన మంచాల జ్ఞానేందర్ గుప్తా తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడేలా వినూత్నంగా రూపొందించి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. వ్యాపారరీత్యా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నివసిస్తున్న జ్ఞానేందర్ గుప్తా, సిరిసిల్ల, నిజామాబాద్, హైదరాబాద్ ప్రాంతాల్లో నిరుపేదల కోసం ఉచిత స్వర్గలోక యాత్ర వాహనాలు, బాడీ ఫ్రీజర్ సేవలను అందిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

అదే సేవాభావంతో తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను కూడా ప్రత్యేకంగా తయారు చేయించారు.ఈ ఆహ్వాన పత్రికను మట్టితో నింపిన కుండీలో ఉంచి, పైన మట్టి వేసి ప్రతిరోజూ నీరు పోస్తే, వారం రోజుల్లో కార్డు పూర్తిగా కరిగిపోయి అందులో నిక్షిప్తం చేసిన విత్తనాల నుంచి తులసి మొక్క మొలకెత్తేలా రూపొందించారు.వివాహం అనంతరం మంచి రోజు చూసుకుని ఈ కార్డును నాటాలని, తద్వారా ప్రతి ఆహ్వాన పత్రిక ఒక మొక్కగా మారి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుందని జ్ఞానేందర్ గుప్తా తెలిపారు. ఈ వినూత్న ఆలోచనపై స్థానికులు, ఆహ్వానితులు ప్రశంసలు కురిపిస్తూ, ఇలాంటి పర్యావరణహిత కార్యక్రమాలను మరింత మంది అనుసరించాలని అభిప్రాయపడుతున్నారు.