8 July, 2026 | 6:50 PM

మనస్ఫూర్తిగా ప్రేమించా..

18-12-2024 12:00 AM

వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ హిట్ కొట్టే కథానాయకుల్లో అడవి శేష్ ముందుంటారు. ఆయన సినిమాలకు అభిమానులు ఎక్కువే. ప్రస్తుతం అడవి శేష్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘డకాయిట్’. షనైల్ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ  ప్రాజెక్ట్‌ను అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. మంగళవారం అడవి శేష్ పుట్టిన రోజు కావడంతో ఈ సందర్భంగా టీమ్ ఓ అప్‌డేట్‌ను పంచుకుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా తొలుత శ్రుతి హాసన్ అంటూ ప్రచారం జరిగింది.

అయితే ఈ చిత్రంలో కథానాయికగా మృణాల్ ఠాకూర్‌ను ఎంపిక చేసినట్టుగా చిత్రబృందం వెల్లడిస్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌ను షేర్ చేసిన అడవి శేష్.. ‘ప్రేమించావు కానీ మోసం చేశావు.. విడిచిపెట్టను.. తేలాల్సిందే’ అని క్యాప్షన్ పెట్టాడు. దీనిపై మృణాల్ కూడా స్పందించింది. ‘అవును వదిలేశాను.. కానీ మనస్ఫూర్తిగా ప్రేమించాను’ అంటూ అడవి శేష్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ఇద్దరు మాజీ ప్రేమికుల మధ్య యాక్షన్, ఎమోషన్, డ్రామాతో నిండిన కథగా ‘డెకాయిట్’ తెరకెక్కుతోంది.

‘గూఢచారి’ చిత్రానికి సీక్వెల్‌గా ఇది రూపొందుతోంది. తనకు ద్రోహం చేసిన తన మాజీ ప్రియురాలిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న ఒక వ్యక్తి ఆమెను ట్రాప్ చేసేందుకు ఎలాంటి ప్రమాదకరమైన ప్లాన్‌ను రూపొందించాడనేది కథాంశం. మరి ఈ సినిమాలో తన ప్రియుడికి మృణాల్ చేసిన ద్రోహమేంటి? దాని కారణంగా ఆమె ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుందో తెరపై చూడాలి.