బీజేపీతోనే మాదిగలకు న్యాయం

22-04-2024 12:10:00 AM

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 21(విజయక్రాంతి): బీజేపీతోనే మాదిగలకు న్యాయం జరుగుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. మహ బూబ్‌నగర్‌లోని ఓ కల్యాణ మండపంలో ఆదివారం బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణతో కలిసి ఎమ్మార్పీఎస్ నాయకులతో నిర్వ హించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కష్టపడి పనిచేసే ప్రతిఒక్కరికీ సముచి త స్థానం కల్పించే శక్తి సామర్థ్యాలు బీజేపీకి మాత్రమే ఉన్నాయన్నారు. డీకే అరుణ గెలుపును ప్రతి ఎమ్మార్పీఎస్ నాయకుడు బాధ్యతగా తీసుకోవాలన్నారు. ఎన్నికల సమయంలో మభ్యపెట్టేందుకు ఎంతో మంది వస్తారని, నాయకులు వారి మాటలు నమ్మొద్దని సూచించారు.

బీజేపీకి సంపూర్ణ మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం, కాశ్మీర్‌లో 370 అర్టికల్ రద్దు, అగ్రకులాలకు రిజర్వేషన్లు.. కేవలం బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యమయ్యాయన్నారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని ఇప్పటికే ప్రధాని మోదీ స్పష్టమైన హామీ ఇచ్చారని, ఆ విషయంలో నాయకులు సందేహించవద్దన్నారు. కాంగ్రెస్ హయంలో స్కాములు తప్ప అభివృద్ధి జరగలేదన్నారు. ఎస్సీని ముఖ్యమంత్రిని చేస్తానని ఉద్యమ సమయంలో కేసీఆర్ ప్రకటించారని, తీరా తెలంగాణ వచ్చాక కేసీఆర్ తానే ముఖ్యమంత్రి అయ్యారన్నారు. బీఆర్‌ఎస్‌ను ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు.

ఆదరించండి .. అండగా ఉంటా: బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ

ప్రజలు తనను ఆదరించి ఎన్నికల్లో గెలిపిస్తే, ఎల్లప్పుడూ అండగా ఉంటానని బీజేపీ మహబూబాబ్‌నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. జిల్లాకేంద్రంలోని వీరన్నపేటలో ఆదివారం నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో ఆమె మాట్లాడారు. బీజేపీ దేశానికి రక్షణ కవచంలా వ్యవహరిస్తున్నదని, పార్టీకి ప్రజలు మద్దతు ఇచ్చి బలపరచాలని కోరారు. ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించేందుకు బీజేపీ సిద్ధంగా ఉంటుందన్నారు. ప్రచారంలో పార్టీ నాయకులు శ్రీరాములు, జంగయ్య, శివ, కార్తీక్, వెంకటయ్య, కొండయ్య, రాంచందర్, పోలే బాలయ్య, వెంకటస్వామి పాల్గొన్నారు.