నేటి నుంచి మహా సంపర్క్ అభియాన్
- ఇంటింటికి బీజేపీ.. ప్రతి ఇంటికి బూత్ అధ్యక్షుడు
- స్థానిక ఎన్నికల నేపథ్యంలో కమలనాథుల ప్రచారం
హైదరాబాద్, ఆగస్టు 2 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీజేపీ రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం చేసేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా ఇంటింటికి వెళ్లి పార్టీ ప్రచారాన్ని చేపట్టేందుకు ఆ పార్టీ అధిష్ఠానం కార్యాచరణ సిద్ధం చేసింది. మహా సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈనెల 3,4 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికి బీజేపీ...- ప్రతి ఇంటికి పోలింగ్ బూత్ అధ్యక్షుడు కార్యక్రమాన్ని చేపడుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో సాధించిన ప్రగతిని, చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యంగా పార్టీ నిర్దేశించుకుంది. రాష్ర్టంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, నెరవేర్చని హామీలపై ప్రజలకు వివరించేలా కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రయత్నిస్తారు. శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ‘ఘర్ ఘర్ బీజేపీ’ కరపత్రికను పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు విడుదల చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడానికి, బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయివరకు పార్టీని సంసిద్ధం చేయడానికి చేపట్టిన బీజేపీ మహా సంపర్క్ అభియాన్ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని కాసం తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో స్థానిక ఎన్నికలకు సంబంధించిన జిల్లా వర్కషాప్‌లను విజయవంతంగా పూర్తిచేసిన బీజేపీ.. ఇప్పుడు 566 మండలాల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల కోసం మండలస్థాయి వర్కషాప్‌లు కూడా పూర్తి చేసింది. బూత్ స్థాయిలో ప్రజలతో మమేకమవడానికి మహా సంపర్క్ అభియాన్ కార్యక్రమం ద్వారా అవకాశం ఏర్పడుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. నేడు, రేపు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టే బీజేపీ మహా సంపర్క్ అభియాన్ ద్వారా ప్రతి ఇంటికి వెళ్లేలా కార్యకర్తలంతా కృషి చేయాలని బీజేపీ అధిష్ఠానం దిశానిర్దేశం చేసింది.






