19-01-2026 01:50:33 AM
జాతరకు శ్రీకారం చుట్టిన మెస్రం వంశీయులు
ఉట్టిపడిన ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయ పూజలు
భక్తజన సందడిగా నాగోబా సన్నిధి
ఆదిలాబాద్/ఉట్నూర్, జనవరి 18 (విజయక్రాంతి): అటవీ ప్రాంతంలో పుష్య మాసం నిండు అమావాస్య ఆదివారం అర్ధరాత్రి అడవి బిడ్డలు తమ సంప్రదాయా మహా పూజలతో నాగోబా జాతర మహా ఘట్టానికి శ్రీకారం చుట్టారు. దీంతో సంసృ్కతి.. సాంప్రదాయా లు.. ఆచార వ్యవహారాలతో కూడిన రాష్ర్ట పండుగ వైభవంగా ప్రారంభమైంది. గిరిజనుల రెండవ అతిపెద్ద జాతరగా పేరుగాంచిన ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌లో కొలువైన ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర తమ సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించా రు. మెస్రం వంశీయులు, మహిళలు, ఆడపడుచులు అందరూ తెలుపు రంగు వస్త్రాలనే ధరిం చి, ఒకరివెనుక ఒకరు క్రమబద్ధంగా, వరుస క్రమంలో పాదయాత్రగా నాగోబా ఆలయానికి చేరుకున్నారు.
నాగోబా మహాపూజకు కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఎంపీ గోడం నగేష్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఐటీడీఏ పీవో యువరాజ్ మార్మాట్, ఉట్నూర్ అదనపు ఎస్పీ కాజల్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులకు మెస్రం వంశీయులు తన సంప్రదాయ తలపాగలను చుట్టి నాగోబా దేవుడి ప్రత్యేక పూజకు ఆహ్వానించాగా, గర్భగుడిలో మెస్రం వంశీయుల సంప్రదాయాల ప్రకారం పూజలు చేశారు. పవిత్ర గంగా జలం కోసం వెళ్లిన మెస్రం వంశీయులు గత మూడు రోజుల క్రితమే నాగోబా ఆలయ సమీపంలోని మర్రి చెట్టు కిందకు చేరుకున్నారు. మూడు రోజుల పాటు అక్కడ మెస్రం వంశీ మహిళలతో కలిసి సాంప్రదాయ పూజలు చేసారు. ఆదివారం నాగోబా మహాపూజ కోసం మురడి ఆలయంలో కొలువై ఉన్న నాగోబా వెండి ప్రతిమను నాయక్ వాడి మె స్రం ధర్ము వెదురు బుట్టలో పెట్టుకొని నాగో బా ఆలయానికి తీసుకువెళ్లారు.
గర్భగుడిలో నాగోబా దేవుడిని ప్రతిష్టించిన తర్వాత ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావు, మెస్రం చిన్ను పటేళ్లు ఆలయ ప్రవేశం చేశారు. తమ సం సృ్కతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా పూజలు ప్రారంభించారు. అర్ధరాత్రి నాగోబా ఆలయంలో అట్టహాసంగా సాంప్రదాయ మహా పూజలు జరిగాయి. ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావు, మెస్రం వంశం పటేళ్లు మెస్రం చిన్ను పటేల్, మెస్రం బాదిరావు పటేల్ ఆధ్వర్యంలో పవిత్ర గంగా జలంతో నాగోబా కు అభిషేకం చేసి, మహాపూజ క్రతువును ప్రారంభించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉండే మెస్రం వంశీయులు నాగోబాను దర్శించుకోవడం, వారి సంసృ్కతి నుంచి పుట్టిన ఆనవా యితీ. పుష్య మాసం అమావాస్య రోజున ప్రారంభమయ్యే నాగోబా జాతర వారం రోజు ల పాటు కొనసాగుతుంది.
తెగల వారీగా మట్టి కుండల పంపిణీ
సిరికొండలో గుగ్గిళ్ల కుమ్మరి కుటుంబం వారు తయారు చేసిన మట్టి కుండలను తీసుకువచ్చి ఆలయ ప్రాంగణంలో వాటికి పూజలు చేశారు. మెస్రం వంశీయులలో 22 తెగలవారికి మట్టి కుండలను పంపిణీ చేశారు. మట్టి కుండలు తీసుకున్న మహిళలు, మెస్రం వంశం ఆడపడుచులు, అల్లుళ్లు మర్రిచెట్ల వద్ద గల కోనేరుకు వరుస క్రమంలో వెళ్లి నీరు తీసుకువచ్చారు. కోనేరు నీరుతో ఆలయ ప్రాంగణంలో అల్లుళ్లు ఆడపడుచులు మట్టితో పుట్టను తయారు చేశారు. ఈ కార్యక్రమంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నరేష్ జాదవ్, బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితీష్‌రాథోడ్, డి.డి అంబాజీజాదవ్, ఈ.ఈ తానాజీ జాదవ్, ఆలయ కమిటీ చైర్మన్ మెస్రం ఆనంద్‌రావు, సర్పంచులు మెస్రం తుకారాం, మెస్రం భీమ్రావు పాల్గొన్నారు.