19-01-2026 01:54:38 AM
మీపై పోరాడేందుకు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు
వైఎస్ బతికుంటే హరీశ్‌రావు వెన్నుపోటు రాజకీయాలు అప్పుడే బయటపడేవి
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
హైదరాబాద్, జనవరి 18 (విజయక్రాంతి): ‘రాజకీయంగా అండగా నిలిచిన టీ డీపీని కాదని, తెలంగాణ ప్రయోజనాల కో సం, మీలాంటి దోపిడీదారులపై పోరాడేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు’ అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.. మాజీ మంత్రి హరీశ్‌రావును ఉద్దేశించి అన్నారు. హరీశ్‌రావుతో బీజేపీతో నడుపుతున్న ప్రేమాయాణాన్ని బయటపెట్టిన కవిత వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలని ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రాజకీయంగా జన్మనిచ్చిన టీడీపీ తెలంగాణలో లేకుండా చేసిన చరిత్ర మీదని, నీడని చ్చిన చెట్టునే నరికే వ్యక్తిత్వం మీదని మండిపడ్డారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బతికుంటే హరీశ్‌రావు కాంగ్రెస్ కండువా కప్పుకునే వారని, అప్పుడే ఆయన వెన్నుపోటు రాజకీయాలు బయటపడేవని వ్యాఖ్యానించారు.
అన్నం పెట్టిన వారికి సున్నం పెట్టే నైజం కేసీఆర్, హరీశ్‌రావుదని విమర్శించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో కాంగ్రెస్, టీడీపీ దిమ్మెలను కూల్చమని పిలుపునిచ్చిన విషయం మర్చిపోయారా? అని నిలదీశారు. బీఆర్‌ఎస్ దిమ్మెలను తాము కూల్చాల్సిన అవసరం లేదని, తెలంగాణ ప్రజలే మిమ్ములను కుప్పకూల్చి ఫామ్‌హౌస్‌లో కూర్చొ బెట్టారని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డికి వెన్నుపోటు రాజకీయాలు తెలియవని, బరిగీసి కొట్లాడటమే తెలుసన్నారు. హరీశ్‌రావు మామ చాటు అల్లుడిలా నటిస్తూ అనాటి సీఎం రాజశేఖర్‌రెడ్డికి బోకే ఇచ్చిన నీ బాగో తం అందరికి తెలుసన్నారు. పదేళ్లుగా బీజేపీతో దోస్తానా చేసిన విషయాన్ని ప్రజలు మర్చిపోలేదన్నారు.