10 June, 2026 | 1:24 AM

ముంబై షెడ్యూల్ ముగించారు

10-06-2026 12:00 AM

హీరో సాయిదుర్గాతేజ్ పాన్-ఇండియా స్పెక్టికల్ ‘ఎస్‌వైజీ’ (సంబరాల ఏటిగట్టు)తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాను రోహిత్ కేపీ దర్శకత్వంలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తుండగా.. జగపతిబాబు, సాయికుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఒక నిరంకుశ పాలకుడికి వ్యతిరేకంగా, తన దేశ ప్రజల స్వేచ్ఛ కోసం ఒక ధైర్యవంతుడైన యువకుడు చేసే పోరాటమే ఈ సినిమా కథ.

ఈ భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో సాయిదుర్గాతేజ్ తన కెరీర్‌లోనే అత్యంత సవాలుతో కూడిన శక్తిమంతమైన పాత్రను పోషిస్తున్నారని, ఈ చిత్రం ఆయన సినీ ప్రయాణంలో ఒక మైలురాయిగా నిలువనుందని ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌ను బట్టి తెలుస్తోంది. ఇదిలావుంటే, ఈ చిత్రానికి సంబంధించి ముంబై షెడ్యూల్ తాజాగా పూర్తయింది. ఈ విషయాన్ని టీమ్ అధికారికంగా వెల్లడించింది.

తాజాగా ముగిసిన షెడ్యూల్‌లో ఓ బాలీవుడ్ స్టార్ నటుడు పాల్గొన్నారని, ఆయన భాగస్వామ్యం తమ చిత్రానికి మరో ప్రత్యేక ఆకర్షణగా మారిందని టీమ్ పేర్కొంది. మేకర్స్ ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్-ఇండియా స్థాయిలో థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.