పారిశుద్ధ్య నిర్వహణలో సమయపాలన పాటించండి
ఇంటి పన్నుల విషయంలో వేగం పెంచండి
పచ్చదనానికి నిలయాలు ప్రభుత్వ పార్కులు
మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి
జవహర్ నగర్,(విజయక్రాంతి): మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సర్కిల్ల లో పారిశుద్ధ్య నిర్వహణలో సమయపాలన పాటించాలని ఇంటి పన్నుల విషయంలో వేగం పెంచి అనుకున్న లక్ష్యాలను సాధించాలని, పచ్చదనానికి నిలయాలుగా ప్రభుత్వ పార్కులు నిలుస్తున్నాయని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ యాప్రాల్ వార్డులో బుధవారం కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, కీసర డిప్యూటీ కమిషనర్ వసంతతో కలిసి యాప్రాల్ వార్డు నందు శానిటేషన్, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, పార్కులు తదితర పనులను పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సర్కిల్ పరిధిలోని ప్రాంతాలలో ఇంటి పన్నులు వసూళ్లలో వేగం పెంచాలని, ప్రజలకు సరియైన అవగాహన కల్పిస్తూ, పారిశుద్ధ్య నిర్వహణ టౌన్ ప్లానింగ్ శానిటేషన్ తదితర కార్యక్రమాల్లో వేగం పెంచాలని సూచించారు. ప్రభుత్వ పార్కులు పచ్చదనానికి నిలయాలుగా నిలుస్తున్నాయని, పచ్చదనానికి పెద్దపీట వేస్తూ పార్కులను సంరక్షించవలసిన బాధ్యత సిబ్బందితోపాటు ప్రజలకు కూడా ఉందని తెలిపారు. సకాలంలో ఇంటి పన్నులు చెల్లించి మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలని ప్రజలకు సూచించారు.
అనంతరం యాప్రాల్ వార్డునంతా కలియ తిరుగుతూ వివిధ పనులను పర్యవేక్షిస్తూ రెవెన్యూ, ఇంజనీరింగ్, శానిటేషన్, సిబ్బందికి తగిన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కీసర సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఎన్. వసంత, శానిటేషన్ డి ఈ మాధవాచారి, ఏఎంసీలు వెంకటేష్, శ్రవణ్, గంగన్న, మధుసూదన్ రెడ్డి, నగేష్ బాబు, యు సి డిపార్ట్మెంట్, ఏసిపి శ్రీనివాస్, టి పి ఎస్ స్రవంతి, ఇంజనీరింగ్, ఏఈలు, సర్కిల్స్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.




