29-07-2025 02:40:24 AM
ఏజీ సుదర్శన్ రెడ్డితో మంత్రి దామోదర రాజనర్సింహ
హైదరాబాద్, జూలై 28 (విజయక్రాంతి): ఎంబీబీఎస్ కౌన్సెలింగ్‌కు సంబంధించిన స్థానికత అంశంలో తెలంగాణ విద్యార్థుల ప్రయోజ నాలు కాపాడేలా కోర్టులో వాదనలు వినిపించాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ కోరారు. సోమవారం ఆయన రాష్ట్ర అడ్వకేట్ జనరల్ జస్టిస్ సుదర్శన్ రెడ్డితో సమావేశమయ్యారు. సుప్రీంకోర్టులో వాదనల కోసం అవసరమైతే సీనియర్ న్యాయవాదుల సహకారం తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు.
మన రాష్ట్ర విద్యార్థులకే మెడికల్ సీట్లు దక్కేలా గత ఏడాది తీసుకొచ్చిన జీవో 33 ప్రకారం న్యాయం జరిగేలా చూడాలన్నారు. అయితే ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురు విద్యార్థులు తెలంగాణ స్థానిక కోటాలో తమకు కూడా సీట్లు ఇవ్వాలని సుప్రీంకోర్టును ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఆశ్రయించిన తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం వాదనలను బలంగా వినిపించేందుకు గాను మంత్రి దామోదర.. ఏజీతో భేటీ అయ్యారు. వచ్చే నెల 5న జరగనున్న వాదనలకు ఇప్పటి నుంచే రాష్ట్రం తరఫున పూర్తి స్థాయిలో సన్నద్ధత ఉండాలని సర్కారు భావిస్తోంది.