29-07-2025 02:39:20 AM
జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 28 (విజయక్రాంతి): ప్రజావాణిలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జీహెచ్‌ఎంసి కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. సోమవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజ లు కమిషనర్‌కు తమ సమస్యలపై అర్జీలను అందజేశారు. అర్జీలను కమిషనర్ క్షుణ్ణంగా పరిశీలించి సత్వర పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించవద్దని ఆదేశించారు.
జీహెచ్‌ఎంసీ స్పెషల్ మాన్సూన్ డ్రైవ్
వర్షాకాలం నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ జూలై 29 నుంచి ఆగస్టు 8 వరకు ప్రత్యేక మాన్సూన్ డ్రైవ్ చేపట్టనుందని కమిషన్ కర్ణన్ తెలిపారు. ఇందులో భాగంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని 150 వార్డుల్లో వ్యర్థాల తొలగింపు, పరిశుభ్రత కార్యక్రమాలు చేపడతారని వెల్లడించారు. రోజూ ఉదయం 5:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ఈ పరిశుభ్రతా చర్యలు నిర్వహిస్తారు. జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, ఆరోగ్య శాఖాధికారులు, సర్కిల్ మేనేజర్లు, ఎంటమాలజిస్టులు ఈ డ్రైవ్‌ను విజయవంతం చేయాలని ఆర్‌వి కర్ణన్ ఆదేశించారు.
రోడ్డు భద్రతా చర్యలు ముమ్మరం
రోడ్డు సేఫ్టీ కార్యక్రమంలో భాగంగా నగరంలో ప్రమాదాల నివారణకు క్యాచ్ పిట్స్, పాట్ హోల్స్ మీడియం మరమ్మతులు ముమ్మరంగా చేపడుతున్నట్టు కమిషనర్ కర్ణన్ తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 5438 పాట్ హోల్స్ అటెండ్ గాక అందులో 5157 నిన్నటి వరకు పాట్ హోల్స్ మరమ్మతులు చేశారు. సోమవారం 281పాట్ హోల్స్ పూర్తిచేశారని చెప్పారు. కమిషనర్ ఆదేశాల మేరకు పాట్ హోల్స్, క్యాచ్ పిట్స్ మరమ్మతులు చేస్తున్నట్లు మెయింటెనెన్స్ సీఈ రత్నాకర్ తెలిపారు.