calender_icon.png 11 December, 2025 | 11:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశ్నించే గొంతులకు పట్టం కట్టండి

11-12-2025 10:05:45 PM

సిపిఎం అభ్యర్థులను గెలిపించండి..

మోతే (విజయక్రాంతి): గ్రామ పంచాయితీ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతులకు పట్టం కట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు అన్నారు. గురువారం మోతే మండల పరిధిలోని అన్నారి గూడెం గ్రామంలో 9వ వార్డు సిపిఎం అభ్యర్థి గుడిపురి కరనేశ్వరరావు గ్యాస్ పొయ్యి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతూ గడపగడప తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజా సమస్యలపై లోతైన అవగాహన ఉన్న వారిని, నిజాయితీపరులను గెలిపించాలన్నారు. ఎన్నికల్లో కులం, మతం, డబ్బు, మద్యం తో ఎన్నికల్లో పోటీ చేసే వారిని ఓడించాలన్నారు.

నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడే అన్నారుగూడెం గ్రామంలోని 9వ వార్డు సిపిఎం అభ్యర్థి గుడుపురి కరణేశ్వరరావు గత 30 సంవత్సరాలుగా గ్రామంలో ప్రజా సమస్యల పైన అనేక పోరాటాలు నిర్వహించాడని అన్నారు. రైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మికుల సమస్యలపై ఎన్నో ఉద్యమాలు చేశారని అలాంటి వ్యక్తిని గెలిపించాలన్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పోటీ చేస్తున్నారని వారిని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ములుకూరి గోపాల్ రెడ్డి, మండల కమిటీ సభ్యులు చర్లపల్లి మల్లయ్య, మేకల ఉపేందర్, తొమ్మిదవ వార్డు అభ్యర్థి గుడిపురి కరనేశ్వరరావు, సిపిఎం గ్రామ కార్యదర్శి గడ్డం మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.