శ్రీశైలంలో ఏపీ అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి
- తాగడానికి నీళ్లు లేకుండా చేస్తారా?
- మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం
హైదరాబాద్, మార్చి 31 (విజయక్రాంతి): శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు తగ్గినా ఏపీ ప్రభుత్వం అక్రమ విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. తాగడానికి కూడా నీళ్లు లేకుండా చేస్తారా? అని నిలదీశారు. నీటి నిల్వలు తక్కువగా ఉంటే విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలనే నిబంధనలు ఉన్నా ఏపీ మాత్రం అందుకు భిన్నంగా అక్రమంగా నీటిని వాడుతోందని దుయ్యబట్టారు.
ఉమ్మడి రాష్ట్రంలో 2012లో ఇలాగే అక్రమంగా నీటిని తరలించుకుపోయిందని, తాము ధర్నా చేస్తాం అనే వరకు నీళ్లు దోచుకున్నారని, నాడు తాము హైకోర్టుకు వెళ్లడంతో కోర్డు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని గుర్తుచేశారు. నిబంధనలకు అనుగుణంగా శ్రీశైలంలో అక్రమంగా నీటిని తరలించడాన్ని ఆపాలని ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
శ్రీశైలంలో తెలంగాణకు 64 శాతం వాటా ఉందని, ఖమ్మం, నల్లగొండ, పాలమూరు జిల్లాల రైతుల హక్కులు కాలరాస్తే ఊరుకోబోమని స్పష్టంచేశారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులు ఇంకా జరగలేదన్నారు. తెలంగాణ ఎప్పుడో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసిందని, ఏపీ చట్ట ప్రకారం నడుచుకోవాలన్నారు. రైతాంగం, ప్రభుత్వం, పార్టీ సమిష్టిగా పోరా టం చేసి హక్కులను కాపాడుకుంటామన్నారు.




