08-12-2025 12:00:00 AM
కొమురవెల్లి, డిసెంబర్7: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మల్లన్న స్వామి కళ్యాణం సమీపించిన వేళ, స్వామివారి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ పరిసర ప్రాంతాలు భక్తి జన సంద్రంగా మారాయి. ఆదివారం ఉదయం నుంచే భక్తుల కోలహాలం మొదలైంది. స్వామి వారి దర్శనానికి భక్తులు క్యూ లైన్లో బా రులు తీరారు. దర్శనానికి గంట పైగా సమయం పట్టింది. భక్తులు ముందుగా స్వామివారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం గర్భాలయంలో ఉన్న మల్లన్న స్వామిని దర్శించుకున్నారు.
తర్వాత మొక్కుబడులలో భాగంగా స్వామివారికి పట్నాలు, బోనాలు చెల్లించి, మొక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా కొండపైనున్న ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. సుమారు 25 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవాదాయ శాఖ వారు అన్ని ఏర్పాట్లు చేశారు.
మూలవిరాట్ దర్శనం నిలిపివేత
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి వార్షిక కల్యాణోత్సవంలో భాగంగా స్వామివారి, అమ్మవార్ల మూలవిరాట్ లకు పంచరంగుల అలంకరణ చేయడం మూలంగా స్వామివారి దర్శనం నిలిపి వేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి టంకశాల వెంకటేష్ తెలిపారు. ఆదివారం రాత్రి 8 గంటల నుండి 14 తేదీ వరకు నిలుపుదల చేస్తున్నట్లు తెలిపారు 14న ఉదయం 6 గంటలకు స్వామివారి దర్శనం కల్పించబడుబడును.