10 March, 2026 | 9:01 PM

వైద్య సేవలపై కలెక్టర్ అసంతృప్తి

10-03-2026 05:43 PM

పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించిన కలెక్టర్ కె.హరిత

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చు రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కె. హరిత అన్నారు. మంగళ వారం కౌటాల మండల కేంద్రంలో వివిధ కార్యాలయాలను ఆకస్మిక తనిఖి నిర్వహించారు. కౌటాల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ  చేయగా అక్కడ డాక్టర్ లేక కేవలం సిబ్బంది మాత్రమే ఉన్నారు. డాక్టర్ పవన్ కళ్యాణ్ రిజైన్ చేయగా కేవలం సిబ్బంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. కలెక్టర్ హాస్పిటల్ లోని రిజిస్టర్ లు పరిశీలించారు.

పలువురు సిబ్బంది విధులకు హాజరు కాకపోవడంతో పాటు రిజిస్టర్ లో హాజరు పట్టిక లో ఖాళీగా ఉండడంతో ఇదేం పద్ధతి అంటూ ప్రశ్నించారు. డాక్టర్ లేకపోవడంతో ఆయుష్ డాక్టర్ వారంలో మూడు రోజులు వస్తున్నట్లు చెప్పగా, ఆయుష్ అటెండర్ విధులకు రాకపోవడంతో గైర్హాజరు వేసింది. అక్కడే డేటా ఎంట్రీ గది మూసి ఉండడంతో దాన్ని తెరిచి చూడగా సిస్టమ్ ,ప్రింటర్ పై డస్ట్ పేరుకుపోయి ఉండడంతో ఇది చూస్తే మీ పని తీరు అర్థం అవుతోందని తమాషాలు చేయొద్దని ఘాటుగా మందలించారు. అనంతరం జిల్లా పరిషత్ సెకండరి హాస్టల్ లో తనిఖీ చేసి పదో తరగతి స్టూడెంట్స్ తో మాట్లాడారు.

గైర్హాజరు అయిన స్టూడెంట్స్ ఎందుకు అయ్యారని ఆరా తీశారు. వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా ముందుకు సాగాలని విద్యార్థులకు, టీచర్లకు సూచించారు. నాలుగు రోజుల్లో పరీక్షలు ఉన్నందున భయపడకుండా ప్రశాంతంగా చదువులపై దృష్టి పెట్టాలని సూచించారు. మధ్యాహ్న భోజనం పై, ప్రహరీ గోడ నిర్మాణం పై ఆరా తీశారు. పాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో నిర్మించిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం  పరిశీలించారు. బీసీ హాస్టల్ (బాలురు)ను  తనిఖీ చేసి స్టోర్ రూము, వంటగది, పిల్లల గదులు పరిశీలించారు. పిల్లలకు హైజీనిక్ భోజనం అందించాలని వార్డెన్ కి సూచించారు.                         

* ప్రాణహిత నది సందర్శన....

కౌటాల మండల పర్యటనలో భాగంగా కలెక్టర్ హరిత  తుమిడి హెట్టి వద్ద ప్రాణహిత నదిని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టే ప్రాంతాన్ని పరిశీలించారు. మహారాష్ట్ర, తెలంగాణ నదుల కలయికతో ప్రాణహితగా ఏర్పడుతున్న విషయాన్ని ఎంపీడీవో ప్రసాద్ వివరించారు. నీటి లభ్యత, వానాకాలం వరద పరిస్థితి గురించి ఆరా తీశారు. ఎండాకాలం నేపథ్యంలో నదిలో నీళ్లు ఉంటాయా అనే వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో  మండలాభివృద్ది అధికారి ప్రసాద్, తహసిల్దార్ ప్రమోద్ కుమార్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.