పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన వ్యక్తి అరెస్ట్
చిట్యాల, ఏప్రిల్ 29 : విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అడ్డుకుని, వారిపై దురుసుగా ప్రవర్తించి పరారైన నలుగురు నిందితుల్లో ఒకరిని బుధవారం చిట్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. నేరానికి ఉపయోగించిన బలెనో కారు (ఏపీ-40-ఎఫ్‌ఎ ల్-0512)ను స్వాధీనం చేసుకున్నారు. సిఐ కె. నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం, ఈనెల 25న విజయవాడ ఆటోనగర్ ప్రాంతంలోని ఎస్బిఐ ఎటిఎం వద్ద డబ్బు లు డిపాజిట్ చేయడానికి వచ్చిన వ్యక్తిని నిందితులు మాయమాటలు చెప్పి మో సం చేశారు.
మీకు ఫోన్ పే చేస్తాం అంటూ ఫ్రాంక్ పేమెంట్ యాప్ ద్వారా నకిలీ మెసేజ్ చూపించి, అతని వద్ద నుంచి రూ.13,000 నగదు తీసుకుని పరారయ్యారు. అదే రోజు చిట్యాల ప్రాంతంలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా, విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న బలెనో కారును ఆపేందుకు ప్రయత్నించారు. అయితే కారులో ఉన్న హేమసాయి, హరి, సురేష్, బాలు పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా దురుసుగా ప్రవర్తించి, వాహన పత్రాలు చూపించకుండా పోలీసులను నెట్టివేసి అక్కడి నుంచి పారిపోయారు.
బుధవారం చిట్యాల బస్టాండ్ వద్ద కారును వదిలి పారిపోయిన వ్యక్తుల్లో ఒకరు ఉన్నట్లు సమాచారం అందడంతో ఎస్‌ఐ మామిడి రవి కుమార్ తమ సిబ్బందితో అక్కడికి వెళ్లి బుద్ధ హేమసాయి అనే నిందితుడిని పట్టుకున్నారు. విచారణలో అతను ఆంధ్రప్రదేశ్ కు చెందిన అనకాపల్లి జిల్లా వాసిగా గుర్తించారు. పట్టుబడిన నిందితుడు మరియు అతని సహచరులు ఆంధ్రప్రదేశ్లో పలు నేరాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.
ప్రస్తుతం పరారీలో ఉన్న హరి, సురేష్, బాలు కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అడ్డుకోవడం తీవ్రమైన నేరమని, ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈ కేసును చేధించడంలో ప్రతిభ కనబరిచిన ఎస్‌ఐ రవి కుమార్, ఏఎస్‌ఐ, పీసీలు ఆనంద్, మహేష్, వెంకన్నలను నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.






