మానవుడే మాధవుడుగా మారే పద్ధతి
ఉపనిషత్ సుధ :
పదార్థ వాదం అన్నిటికీ సమాధానం ఇవ్వలేదు. ఆత్మవాది, ఆత్మవేది కాగల నచికేతసుడి వంటివాడు యదార్థ వాదం వైపు మనసును మరల్చుకున్న వాడు. కనుకనే, సమవర్తి అయిన యముణ్ణి సమీపించ గలిగాడు. సంభాషించ గలిగాడు. యమ ప్రశంసను పొందగలిగాడు.
అహంకారం, అస్పష్టత, అవిద్య, ఆభిజా త్యం, అవివేకం వంటి వ్యతిరిక్త భావనలను ఎప్పటికప్పుడు తుడిచి వేసుకోవాలి.
చావు లేని చదువుగా భావించి ఆత్మవిద్యను ఎరగాలి. ఒక మొగ్గ, పరిణామ క్రమం లో పువ్వు, కాయై, పండై నిరంతర నిత్యోదయాన్ని అనుభవిస్తున్నదో; మొగ్గ మొగ్గగా ఉన్నంత వరకు ఏ రంగు, రుచి, వా సన ఎరుగక ఉన్నదో ఆ మొగ్గే పువ్వు తన సొబగులను, పరిమళాలను వెదజల్లుతున్నదో; కాయై పక్వ మ వుతున్నదో; పండై పరిపక్వ రసభరిత మవుతున్నదో; ఆ విధంగానే మని షి ఋషి కావాలి. బ్రహ్మర్షి కావాలి. దీనికి ఆత్మవిద్యను మించి మరొక విద్య లేదు.
‘దేహమే నేను’ అనుకోవటం నుండీ ‘నే ను దేహం మాత్రమే కాద’నుకుంటూ, ‘నేను ఆత్మను’ అన్న ఎరుకలోకి రావాలి. ఇదే ‘పారమార్థిక సార్థక మానవ జన్మ’. జీవన సా ఫల్యం అనుగ్రహించని ఏ సిద్ధాంతమైనా రా ద్ధాంతమే. శుష్క వాదనలన్నీ వేదననే మిగుల్చుతయ్. శాస్త్రాలపై ఉన్న అధికారం ఒక్కొ క్కసారి అంధత్వం వైపు, అహంకారం వైపు అడుగులు వేయిస్తుంది. ఇదొక ప్రమాదకరమైన మలుపు.
ఆ శాస్త్రాధికారమే ఆత్మవిద్యకు దారి చూపిస్తే అదొక కాంతిబాట అవుతుంది.
ఆ విధంగానే భౌతిక సంపద కంటే ఆధ్యాత్మిక సిరి కదలనిది కానీ, అన్నింటిని కదిలిం చగలది. భౌతిక వస్తు సంపద అత్యంత పరిమిత శక్తి కలది. అది సుఖాన్ని ఇవ్వగలదు, ఆపై కొంత తాత్కాలిక సంతోషాన్నీ మిగల్చగలదు. ఆనందాన్ని మాత్రం ఇవ్వలేదు. దాని కి ఆ శక్తి లేదు. ఆత్మే సాక్షాత్తు ఆకారమై ఉన్నదన్న భావన స్థిరమైనప్పుడు ‘దేహమాత్రుడను’ అనుకున్న వాడు తన్ను తానే సరిదిద్దుకొని ఆత్మభావంతో మెలగటం ప్రారంభిస్తాడు. ఇదే జీవన పరమార్థం.
ఈ పరిణామంతో శరీరాన్ని పవిత్రమైన పనిముట్టుగా భావించిన సాధకుడి, ధర్మబద్ధమైన కార్యాచ రణ ప్రారంభం అవుతుంది. ఇక నెమ్మదిగా అన్ని కలాపాలు ఆత్మ చలనాలుగా, విశ్వశ్రేయోదాయకంగా సాగుతయ్. ఆ కారణంగా శాంతి, సహనం, ప్రేమ, సహజీవన సౌందర్యం వంటి మానవీయ భావన లు బహిర్గతమై ప్రపంచాన్ని సౌందర్యమయంగా ఆవిష్కరిస్తూనే దానిని ఒక కర్మ క్షేత్రంగా మారుస్తయ్.
కర్మ ఫలాలను అందరికీ పంచగల విశాల భావనను, త్యాగ నిరతిని, నిరతిశయానందాన్ని పరిచయం చేస్తయ్. నిజానికి ఇదే నిజ పరిణామం! ఈ ప్రాప్తి ప్రతి వ్యక్తికీ కలగాలి. మానవత్వం పరిమళిస్తే అదే మాధవత్వం అవుతుంది. ప్రపంచం తన నడకను బా హ్యంగా మానవత్వంలోనూ, ఆంతరంగికంగా దివ్యత్వంలోనూ సాగించగలిగితే అదే అసలైన మానవ జీవితం.
పవిత్రంగా భావింపబడిన శరీరం నాశమెరిగినది. నాశమెరుగని ఆత్మతో కూడి ఉన్నా దేని స్థితి దానిదే. ఒకటి పోయేది. రెండవది ఎప్పటికీ పోనిది. ఆ రెండవదే మనం అన్న భావనతో జీవితం ప్రవహించాలి. అలుపులేని, ఆగని అందమైన ప్రయాణమే మానవ జీవితం. గతంలో నుంచి స్ఫూర్తిని పొందు తూ వర్తమానాన్ని వెలిగించుకుంటూ ముం దుకు సాగాలి.
విచక్షణ, వివేకం, అన్వేషణ, ఆత్మాన్వేషణ ఆనందాన్ని కలిగిస్తయ్. ఆత్మవిద్య స్థిరబుద్ధిని, సంస్థిత స్థితిని కలిగించి మనిషిని అమరుణ్ణి చేస్తుంది.
‘నచికేతా! కాలబద్ధుడైన మానవుడు ఆత్మవిద్యను ఎరగక పోతే కాలపాశబద్ధుడవుతూ నే ఉంటాడు. ఈ సూక్ష్మాన్ని గ్రహించినవా డు శాశ్వతుడవుతాడు. చైతన్యమై ప్రకాశిస్తా డు’ అన్నాడు సమవర్తి. విషయం అర్థమవుతున్నట్లుగా తల పంకించాడు నచికేతసుడు.
వీయస్‌ఆర్ మూర్తి






