26 March, 2026 | 6:04 PM

తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త! హైదరాబాద్‌లో పిల్లలు తినే ఐస్‌క్రీమ్స్ కల్తీ..!

26-03-2026 04:24 PM

హైదరాబాద్: ఎండలు భగభగ మండుతున్నాయి. ఎండలు మండుతున్న వేళ పిల్లలు పెద్దలు చల్లటి ఐస్ క్రీంలు తినడానికి ఇష్టపడుతారన్న విషయం తెలిసిందే. చిన్నారులు ఇష్టంగా తినే ఐస్ క్రీమ్ ఏం కలుపుతున్నారో?, వాటిని పరిశుభ్రమైన పరిసరాల్లో తయారు చేస్తున్నారా? అనే ప్రశ్నలు అందరి దిమాక్ లో మెదలాలి. గల్లీ గంట సౌండ్ వినపడగానే అప్పుడే నడక నేర్చిన పసివాడు సైతం ఐస్ క్రీమ్ కావాలంటూ బండి దగ్గరకు పరుగులు పెడతాడు.ఇదంతా ఎందుకు చెప్తున్న అంటే... కల్తీ ఐస్ క్రీమ్ తయారీ దారులు రెచ్చిపోతున్నారు. ఇంట్లో పిల్లలు అడిగిన వెంటనే ఐస్ క్రీం కొనిస్తున్నారా? అయితే "తస్మాత్ జాగ్రత్త". 

నగరంలో కల్తీ ఐస్ క్రీం విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు అయింది. సరైన లైసెన్సు లేకుండా ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ నడపడం, నాణ్యత, గడువు ముగిసిన ఉత్పత్తులను ఉపయోగించడం, అపరిశుభ్రమైన పరిస్థితుల్లో ఉత్పత్తులను తయారు చేయడం వంటి ఆరోపణలపై హైదరాబాద్ పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు, టాస్క్ ఫోర్స్ అధికారులు ముషీరాబాద్‌లోని బాపూజీ నగర్‌లో ఉన్న ఒక ఐస్‌క్రీమ్ కర్మాగారంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించి ఆ కర్మాగారాన్ని నడుపుతున్న పట్టాల అశోక్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.

అతను గడువు తీరిన ఉత్పత్తులను వినియోగిస్తున్నట్లుగానూ, అపరిశుభ్రమైన పరిస్థితుల్లో ఐస్‌క్రీమ్‌ను తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. తనిఖీ సమయంలో సదరు సంస్థ కల్తీ, అపరిశుభ్రమైన ఐస్‌క్రీమ్ ఉత్పత్తులను భారీ ఎత్తున తయారు చేస్తూ, విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. ఈ ఉత్పత్తులను నాణ్యమైన ఐస్ క్రీములని తప్పుడు ప్రచారంతో టోకు, చిల్లర వినియోగదారులకు సరఫరా చేస్తూ, తద్వారా అక్రమ లాభాలు ఆర్జిస్తున్నారు. గడువు తీరిన పదార్థాలతో ఐస్‌క్రీమ్ ఉత్పత్తులతో ప్రజల ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పును కలిగిస్తోందని అధికారులు హెచ్చరించారు. రూ. 1.75 లక్షల విలువైన ఐస్ క్రీమ్ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.