వైద్య సేవలపై నమ్మకం కలిగించని యాజమాన్యం
సిఐటియు బ్రాంచ్ అధ్యక్షులు సాంబారు వెంకటస్వామి..
మందమర్రి (విజయక్రాంతి): ఏరియాలోని రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రిలో కార్మికులకు వారి కుటుంబ సభ్యులకు నాణ్యమైన వైద్య సేవలందించడంలో సింగరేణి యాజమాన్యం(Singareni Management) పూర్తిగా విఫలమైందని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్(CITU) బ్రాంచ్ అధ్యక్షులు సాంబారు వెంకటస్వామి(CITU Branch President Sambaru Venkataswamy) ఆరోపించారు. ఏరియా ఆసుపత్రిని ఆయన మంగళవారం సందర్శించి మాట్లాడారు. కార్మికుల సంక్షేమం దృష్ట్యా డిస్పెన్సరీ, ఏరియా ఆసుపత్రులను నిర్మించిన యాజమాన్యం సరైన డాక్టర్లను నియమించక పోవడం, మందులను సరిగ్గా అందుబాటులో ఉంచకపోవడంతో కార్మికులలో సింగరేణి ఆసుపత్రుల పట్ల నమ్మకం కోల్పోతుందని ఆయన విమర్శించారు.
ఒకవైపు యాజమాన్యం రిఫరల్ వ్యవస్థను తగ్గించి కార్మికులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని చెబుతున్నప్పటికీ ఆచరణలో విఫలమవుతుందని మండిపడ్డారు. ఏరియా ఆసుపత్రులలో గర్భిణీ స్త్రీల రైతు సేవలకు స్కానింగ్ మిషన్లు, నవజాత పిల్లల సౌకర్యార్థం ఇంక్యుబేటర్లు అందుబాటులో లేకపోవడంతో వైద్య సేవల కోసం సమీప పట్టణాలకు పంపించడంతో కార్మికులు వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గనుల్లో జరిగిన ప్రమాదాలలో గాయపడ్డ కార్మికులు ప్రమాద రిపోర్ట్ తో ఆసుపత్రిలో అడ్మిట్ అయిన అనంతరం ఫిట్ ఇచ్చే వరకు ఆసుపత్రిలో ఉంచు కోవడం వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
యాజమాన్యం ఏర్పాటుచేసిన సిటి స్కానింగ్ మిషన్ పని చేయకపోయినా పట్టించుకోవడంలేదని, రక్త పరీక్షలను నిర్వహించే పరికరాలు,టెక్నీషియన్ల సంఖ్యను పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. గెలిచిన సంఘం ఏరియా స్ట్రక్చరల్ సమావేశాల్లో కార్మిక సమస్యలపై యాజమాన్యంను ప్రశ్నించక పోవడంతో కార్మిక సంక్షేమం కుంటుపడుతుందన్నారు. స్ట్రక్చరల్ సమావేశాలలో కార్మిక సమస్యలు ప్రస్తావిస్తు న్నామని చెబుతున్న నాయకులు సమస్యలు ఎందుకు పరిష్కారం కావడం లేదో కార్మికులకు చెప్పాలని, ఓడిన సంఘాల వలె వినతి పత్రాలు ఇవ్వడం మానుకొని గత స్ట్రక్చర్ సమావేశాల్లోని డిమాండ్లను ఎందుకు పరిష్క రించడం లేదని యాజ మాన్యాన్ని నిలదీయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వడ్లకొండ ఐలయ్య, అలవాల సంజీవ్, లింగాల రమేష్, రాజ్ కుమార్, డి సురేష్, విజయ్ కుమార్ లు పాల్గొన్నారు.






