నెన్నెల పోలీస్ స్టేషన్‌ను డీసీపీ భాస్కర్ ఆకస్మికంగా తనిఖీ
బెల్లంపల్లి,(విజయక్రాంతి): నెన్నెల పోలీస్ స్టేషన్‌ను మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించిన, డీసీపీ, రిసెప్షన్ సెంటర్‌లోని సిబ్బందితో మాట్లాడి రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం స్టేషన్ రైటర్, సీసీటీఎన్‌ఎస్ రైటర్లతో మాట్లాడి ఆన్‌లైన్‌లో వివరాల నమోదు,రికార్డుల అప్‌లోడ్ ప్రక్రియపై ఆరా తీశారు. రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ ఉండాలని ఆదేశించారు. దర్యాప్తులో భాగంగా ప్రతి నేరస్థలాన్ని తప్పనిసరిగా సందర్శించాలని, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ నిర్వహించి ఆధారాలను నమోదు చేయాలని,ఈ-సాక్ష్య (E-Sakshya) అప్లికేషన్‌లో సంబంధిత సమాచారాన్ని వెంటనే అప్‌డేట్ చేయాలని దర్యాప్తు అధికారులకు సూచించారు. పెండింగ్ కేసుల ఫైళ్లు,నేరాల రికార్డులు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. నమోదైన కేసులు, వాటి దర్యాప్తు పురోగతి, పెండింగ్ వ్యవహారాలపై సీఐ హనోక్,ఎస్‌ఐ రామకృష్ణరావును అడిగి వివరాలు తెలుసుకున్నారు.
- అప్రమత్తంగా ఉండాలి
ఈ సందర్భంగా డీసీపీ ఎగ్గడి భాస్కర్ మాట్లాడుతూ, పోలీసు సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని,సీసీ కెమెరాల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ప్రతి పోలీసు కానిస్టేబుల్ గ్రామ పోలీసు అధికారిగా గ్రామాలను నిరంతరం సందర్శిస్తూ, ప్రజలతో సత్సంబంధాలు పెంపొందించుకోవడంతో పాటు సమాచార వ్యవస్థను మరింత పటిష్ఠం చేసుకోవాలని సూచించారు. ప్రజల్లో సీసీ కెమెరాల ప్రాముఖ్యత, సైబర్ నేరాల పట్ల అప్రమత్తతపై అవగాహన కల్పించాలని తెలిపారు.
మాదకద్రవ్యాల నిర్మూలనకు కృషి చేయాలని,అలాగే రహదారి భద్రత, ట్రాఫిక్ నియమాల పాటింపు, హెల్మెట్, సీటు బెల్టు ధరించడం యొక్క ఆవశ్యకతపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ప్రజల భద్రత దృష్ట్యా గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వాటి ఉపయోగంపై ప్రజలు, వ్యాపారుల్లో మరింత అవగాహన పెంపొందించాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ కోసం రాత్రి పెట్రోలింగ్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా, స్నేహపూర్వకంగా వ్యవహరించాలని పునరుద్ఘాటించారు.






