12-01-2026 09:43:12 AM
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ డిమాండ్
అలంపూర్: నిరుపేద దళిత కుటుంబానికి చెందిన జూనియర్ డాక్టర్ లావణ్య( junior doctor Lavanya) మృతికి కారణమైన నిందితుడు ప్రణయ్ తేజ్ కు బెయిల్ రాకుండా కఠినంగా శిక్షించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపురం గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ముందుగా డాక్టర్ లావణ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... నిరుపేద దళిత కుటుంబానికి చెందిన లావణ్య తల్లిదండ్రుల కష్టార్జితంతో గురుకులలో చదువుకుంటూ...తొలి ప్రయత్నం లోనే నీట్ లో ఉత్తమ ర్యాంకును సాధించి సిద్దిపేట మెడికల్ కాలేజీలోఎంబీబీఎస్ లో సీటు సాధించిందన్నారు.
నాలుగున్నర ఏళ్లు కోర్సు పూర్తిచేసి అక్కడే హౌస్ సర్జన్ గా ఇంటర్నషిప్ చేస్తున్న క్రమంలో అక్కడే సీనియర్ రెసిడెంట్ గా విధులు నిర్వహిస్తున్న ప్రణయ్ తేజ్ ఆమెను మోసపూరితమైన , కపటమైన ప్రేమతో వంచించి ఇప్పుడు కులం అడ్డుతో ఆత్మహత్య చేసుకునేలా ప్రవర్తించారని మండిపడ్డారు. మృతికి కారణమైన నిందితుడికి కఠినమైన శిక్షలు విధిస్తూ.. బెయిల్ రాకుండా ప్రభుత్వం చూడాలన్నారు. ప్రణయ్ తేజ్ తో పాటు వారి కుటుంబ సభ్యులను పత్రికల్లో మీడియాలో ప్రచురించాలని డిమాండ్ చేశారు. ఈ విధంగా చేయడం ద్వారా మరో దళితఆడబిడ్డలు అన్యాయం జరగకుండా జాగ్రత్త పడతారన్నారు. అంతేకాక లావణ్య ఆత్మహత్యకు పాల్పడి వారం రోజులు గడుస్తున్న నేటికి అధికార పాలకులు, స్థానిక ఎమ్మెల్యే విజయుడు స్పందించకపోవడం దారుణం అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం లావణ్య కుటుంబానికి అండగా ఉండాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు కొంకల భీమన్న,మస్తాన్ ,శీను, జయరాజు, తదితరులు పాల్గొన్నారు.
50 లక్షల ఎక్స్గ్రేషియా ఉద్యోగం కల్పించాలి.
బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ చైర్మన్ విశారదన్ మహరాజ్
జూనియర్ డాక్టర్ లావణ్య మృతికి కారణమైన ప్రణయ్ తేజను కఠినంగా శిక్షించాలని అంతేకాక మృతురాలి కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా , కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ చైర్మన్ విశారదన్ మహరాజ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం జల్లాపురం గ్రామం చేరుకొని లావణ్య కుటుంబాన్ని పరామర్శించారు.