14 July, 2026 | 6:23 PM

Breaking News

మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు

14-07-2026 06:22 PM

సమావేశం సాక్షిగా బహిర్గతమైన అసమ్మతి స్వరాలు

మూకుమ్మడిగా విమర్శల వెల్లువ

పెల్లుబికిన నిరసన

మానకొండూరు,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా మండల కేంద్రమైన మానకొండూరులో మంగళవారం జరిగిన మండల బిజెపి కార్యవర్గ సమావేశం రసభాసమైంది. గత కొన్నాళ్లుగా మండల బిజెపి పార్టీలో చాపకింద నీరులా సాగుతున్న అసంతృప్తి జ్వాలలు మండల కార్యవర్గం సమావేశం సాక్షిగా బహిర్గతమయ్యాయి. కార్యకర్తల మండల, జిల్లా, నాయకుల అసంతృప్తి, ఆగ్రహ జ్వాలలు పెల్లుబికి భాజపా మానకొండూరు మండల అధ్యక్షుడు కంది రాజిరెడ్డిని సమావేశంలోనే పలువురు సభ్యులు నిలదీశారు. అధ్యక్ష స్థానంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. అసంతృప్తి, అసమ్మతి రాగాలు పెల్లుబికాయి.

ప్రశ్నించే వారిని పక్కన పెడితే పార్టీ బలోపేతం ఎలా అవుతుందని సమావేశంలో నేరుగా కార్యకర్తలు, పార్టీ బాధ్యులు, సమావేశంలో మండల అధ్యక్షున్ని నిలదీశారు. మండల కార్యవర్గాన్ని ఎన్నుకునే సమయంలో ఏ నిబంధనలు పాటించారో ఎంతమందికి సమాచారం ఇచ్చారు, అసలు ఎన్నిక ఎ ప్రాతిపాదికపై జరిపారో చెప్పాలని డిమాండ్ చేశారు. మానకొండూరు నియోజకవర్గం లో పార్టీ బలోపేతమై పటిష్టంగా కొనసాగే పరిస్థితులలో గతంలో ఉండేదని, నేడు పార్టీ తిరోగమనంలో కొనసాగే పరిస్థితి ఎందుకు దాపరించిందో చెప్పాలని, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుకొండ రాజేశ్వర్ రెడ్డి సాక్షిగా సమావేశంలో పలువురు సభ్యులు నిప్పులు చెరిగారు.

పార్టీ కార్యక్రమాలకు కనీసం 20 మందైనా కార్యకర్తలు ఎందుకు హాజరు కావడం లేదని సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో పార్టీ క్యాడర్ కోల్పోతుందని, ఉనికి ప్రశ్నార్థకమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కొంతమందికి పార్టీలో పెద్దపీట వేసి మరి కొంతమంది పై శీత కన్ను వేయటంలో ఔచిత్యం ఏమిటని బహిరంగంగానే విమర్శించారు. పార్టీలో సమతుల్యత కరువై కొంతమందికి కావాలనే పక్కన పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పచ్చునూరు గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ ఫండ్ గా అధిష్టానం పంపిన 3 లక్షల రూపాయల్లో లక్ష రూపాయలు ఎవరి దగ్గర ఉన్నాయని, రెండు లక్షల రూపాయలు మాత్రమే చెల్లించారని, పోటీ చేసిన అభ్యర్థి నేరుగా అధ్యక్షున్ని ప్రశ్నించగా,  సమాధానం కరువైంది. అవి సొంతానికి వాడు కున్నారా, నేటికిని ఈ విషయంపై స్పష్టత కరువైందని, ఈ రూపాయలు ఎవరు వాడుకున్నారని సమావేశంలో సమాధానం చెప్పాలని అభ్యర్థి నిలదీశారు.

బహిర్గతమైన వర్గ పోరు

కేవలం సోషల్ మీడియాలోనే పార్టీ కార్యక్రమాలకు సమాచారం పెట్టి, పార్టీ బాధ్యులందరికీ, తెలియజేశామని భావించటం ఎంతవరకు సమంజసమని అధ్యక్షులు కంది రాజిరెడ్డిని ముకుమ్మడిగా సభ్యులు ప్రశ్నించారు. భిన్న స్వరాలలో అసమ్మతి రాగాలు వినిపించగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుకొండ రాజేశ్వర్ రెడ్డి అందర్నీ సమన్వయ పరిచే ప్రయత్నం చేసినా అది సాధ్యపడకపోగా సమావేశం సాక్షిగా వర్గ పోరు బహిర్గతమైంది మండలంలో ఇసుక క్వారీ నుండి గతంలో వసూలు చేసిన 25 లక్షలు, ఇటీవల సేకరించిన 10 లక్షల రూపాయలు ఏమయ్యాయని సమావేశంలో కార్యకర్తలు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. కనీసం ఫోన్ లోనైనా సమావేశాలకు సమాచారం అందించాలని అందర్నీ పార్టీలో కలుపుకొని వెళ్లి పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలు, మండల, జిల్లా, బాధ్యులు మూకుమ్మడిగా కోరారు.

మండలాధ్యక్షునిపై అసంతృప్తి

సమావేశానికి హాజరైన మండల, జిల్లా, కార్యవర్గ సభ్యులు అధ్యక్షుని వ్యవహార శైలి పై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో అన్నారంలో ఏర్పాటు చేసిన సమావేశంలోనే ఇటువంటి విభేదాలకు తావు లేదని,  సమన్వయంతో అందర్నీ కలుపుకోని పోవాలని సూచించినా, ఫలితం లేదని, మార్పు రాలేదని పార్టీకి మనుగడకు ఇలాంటి చర్యలు విఘాతం కలిగిస్తాయని, జిల్లా బాధ్యులు మండల అధ్యక్షునికి వివరించి, మరోసారి పరిస్థితుల పునరావృతం కాకూడదని, సమాచారం లోపం, అసంతృప్తి జ్వాలలు, అసమ్మతి రాగాలు శృతిమించితే ,అధ్యక్ష స్థానానికి మరో పేరు తప్పక సూచించిక తప్పదనే గట్టి సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం.

మండల కార్యవర్గ సమావేశానికి కార్యకర్తలు కరువు

మానకొండూరులో మంగళవారం జరిగిన మండల కార్యవర్గ సమావేశం పార్టీ సభ్యులు లేక వెలవెల పోయింది. సమాచారం కరువై అధ్యక్షుని ఏకపక్ష ధోరణితోనే ఎక్కువ మంది హాజరు కాలేకపోయారని సమావేశం సాక్షిగా సభ్యుల విమర్శలు చేశారు. అధ్యక్షుని పై వచ్చిన ఆరోపణలకు  కార్యవర్గ సమావేశానికి హాజరైన సభ్యుల సంఖ్య నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుందని నిస్సందేహంగా చెప్పవచ్చు.