ఉత్పత్తి లక్ష్యాల సాధనే ధ్యేయంగా పునరంకితమవ్వాలి
- జీ ఎం ఎన్ రాధాకృష్ణ
- మందమర్రి ఏరియా మల్టీ డిపార్ట్‌మెంటల్ సమీక్ష సమావేశం
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను ధ్యేయంగా సాధనకు కార్మికులు పునర్కితం కావాలని మందమరి ఏరియా జిఎం ఎన్ రాధాకృష్ణ అన్నారు. చారిత్రాత్మక అత్యంత కీలకమైన శాంతిఖని భూగర్భ గనిలో మొదటి, రెండవ, మూడవ షిఫ్ట్ ఉద్యోగులతో ప్రత్యేక మల్టీ డిపార్ట్‌మెంటల్ సమీక్షా సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. మందమర్రి ఏరియాలోనే కాకుండా సింగరేణి సంస్థలోనే శాంతిఖని గనికి ఎంతో ఘనమైన చరిత్ర ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఎన్నో దశాబ్దాలుగా నమ్మకమైన ఉత్పత్తిని అందిస్తూ, ఎంతోమంది నైపుణ్యంగల ఉద్యోగులకు, అధికారులకు శాంతిఖని పుట్టినిల్లుగా నిలిచిందని కొనియాడారు.
భద్రతా ప్రమాణాలను పాటిస్తూ, సంక్లిష్టమైన భౌగోళిక పరిస్థితులను అధిగమించి బొగ్గును వెలికితీయడంలో శాంతిఖని ఉద్యోగుల శ్రమ అమోఘమైనదన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే ఉత్సాహంతో నిర్దేశిత వార్షిక ఉత్పత్తి లక్ష్యాలను సాధించి ఏరియా ప్రగతిలో శాంతిఖని అగ్రగామిగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ విస్తృత స్థాయి సమావేశాలలో కంపెనీ నిర్దేశించుకున్న ఉత్పత్తి ఉత్పాదకత లక్ష్యాల సాధనపై సుదీర్ఘంగా చర్చించారు. భూగర్భ గనులలో అత్యాధునిక యంత్రాల సరైన వినియోగం, ఉత్పాదకత పెంపుదల, సింగరేణి యాజమాన్యం ఉద్యోగుల కొరకు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు ఆర్థిక (ఫైనాన్స్) సంబంధిత విషయాలను అధికారులు ఉద్యోగులకు వివరించారు.
అదేవిధంగా కంపెనీ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలు, రాబోయే రోజుల్లో ఎదుర్కోబోయే సవాళ్లును అధిగమించి నిర్దేశిత లక్ష్యాలను ఎలా చేరుకోవాలో చర్చించారు. గని ఉద్యోగులు యాజమాన్యం సూచించిన సలహాలు, సూచనలను నిరంతరం పాటించడం ద్వారా ఉత్పత్తి, ఉత్పాదకతను మరింత పెంచవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఉద్యోగులందరూ పూర్తి నిబద్ధతతో, క్రమశిక్షణతో తమకు కేటాయించిన విధులను సకాలంలో నిర్వర్తించడం పనితనాన్ని మెరుగుపరుచుకోవలన్నారు. తద్వారా అనుకున్న లక్ష్యాలను సులభంగా సాధించగలమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
సింగరేణి సంస్థ తమ భూగర్భ గనుల (Underground Mines) నుండి వెలికితీసే బొగ్గు నాణ్యతను మరింత మెరుగుపరచడానికి సమగ్ర నాణ్యతా నియంత్రణ చర్యలను చేపట్టి వినియోగదారులకు అత్యుత్తమ శ్రేణి బొగ్గును అందించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషిచేయాలని అన్నారు. బొగ్గును వెలికితీసే క్రమంలో దానితో పాటు రాయి, మట్టి (Shale/Debris) కలవకుండా గని లోపలే (Face cutting) వద్ద తగిన జాగ్రత్తలు వహించాలని స్పష్టం చేశారు. శాంతిఖని గని నుండి వెలువడే బొగ్గు నాణ్యతకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, దానిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కార్మికులందరిపై ఉందన్నారు.
ఈ సమావేశంలో SO to GM G.L ప్రసాద్, ఏ.ఐ.టీ.యూ.సీ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ వెంకటస్వామి, S.K గ్రూప్ ఏజెంట్ ఖాదీర్, ఏరియా ఇంజనీర్ (E & M) బాలాజీ భగవతి జ, AGM (F&A) R.V.S.R.K ప్రసాద్, DGM పర్సనల్ CH. అశోక్, DGM IED కిరణ్ కుమార్, క్వాలిటీ ఇంచార్జ్ ప్రదీప్, శాంతిఖని గని మేనేజర్ సంజయ్ కుమార్ సిన్హా,IED ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్యామ్,సంక్షేమ అధికారి రవి కుమార్, గని ఉద్యోగులు పాల్గొన్నారు.






