రాజోలిలో వ్యక్తి ఆత్మహత్య.. కలకలం
- స్నేహితుడి ఇంటి వరండాలో ఉరేసుకుని మృతి..
- అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు
అలంపూర్, జూలై 20: జోగులాంబ గద్వాల జిల్లా రాజోలిలో ఓ వ్యక్తి స్నేహితుడి ఇంటి వరండాలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఆదివారం రాత్రి వరకు స్నేహితుడితో సాధారణంగా మాట్లాడిన వ్యక్తి, సోమవారం తెల్లవారుజామున మృతదేహంగా కనిపించడంతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. స్థానికుల వివరాల ప్రకారం,ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా రాయదుర్గానికి చెందిన సత్యనారాయణ గతంలో రాజోలిలో నివసించేవాడు.
ప్రస్తుతం రాయదుర్గంలో ఉంటున్న ఆయన ఆదివారం రాత్రి రాజోలికి వచ్చి తన స్నేహితుడు, చేనేత కార్మికుడు గోపి ఇంట్లో బస చేశాడు.సోమవారం ఉదయం ఇంటి బయట వరండాలో చీరలు ఆరేసేందుకు ఏర్పాటు చేసిన పైపుకు ఉరివేసుకున్న స్థితిలో సత్యనారాయణ మృతదేహం కనిపించింది. కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, రాజోలి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు.ఆత్మహత్యకు గల కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. ఘటనతో రాజోలిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.






