12 July, 2026 | 9:40 AM

మెంతికూరతో లాభాలెన్నో!

06-05-2024 12:00 AM

మామూలుగా ఆకుకూరలు అనగానే చాలామంది సెకండ్ ఆప్షన్ కింద వదిలేస్తే, ఇంకొంతమంది అసలు ఆకు కూరలు తినటానికి ఇష్టపడరు. ఎందుకంటే ఆకుకూరల్లో రుచి ఉండదు అని సమాధానం వస్తుంది. నిజానికి ఆకుకూరలు చాలా ఆరోగ్య ప్రయోజనాలనిచ్చే ఆహారం. ఏదో ఒకరకంగా ఆకు కూరలని తీసుకోవటం చాలా అవసరం కూడా. అలా అతి తక్కువసార్లు తినే ఆకు కూరగా మెంతి ఆకుని చెప్పుకోవచ్చు. మెంతి కూరలో ప్రొటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, ఐరన్, కాల్షియం, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, కాపర్లు ఉంటాయి. అలాగే విటమిన్ ఏ, బీ, సీ, డీలు ఉన్నాయి.

లాభాలివే

మెంతి ఆకు రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తుంది. అజీర్తి , గ్యాస్ట్రిక్ సమస్యలు,  వివిధ పేగు సమస్యలను అరికట్టడంలో మెంతి ఆకులు బాగా సహాయపడతాయి. జీర్ణవ్యవస్థలో ఉండే సమస్యలకు మెంతి ఆకు మంచి పరిష్కారం. 

మెంతి ఆకుల్లో ఉండే అమైనో యాసిడ్లు ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడంలో సహకరిస్తాయి. అందువల్ల టైప్ 2 డయాబెటిస్ రాకుండా ఉంటుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. ఇప్పటికే డయాబెటిస్ ఉన్నవాళ్లకి కూడా మెంతి ఆకులు తీసుకోవడం చాలా మంచిది.  

మెంతి ఆకుల్లో ఉండే పోషకాలు గుండెకు చాలా రకాలుగా మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆకుల్లో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. కంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందట. మెంతి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఎ వంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ కారకాలు మంచి కొలెస్ట్రాల్ ను పెంచి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి

పాలిచ్చే తల్లులు మెంతికూరను తింటే అధికంగా పాలు పడతాయి. మెంతి ఆకుల పొడి తో తయారుచేసిన హెర్బల్ టీ అధిక జ్వరం వచ్చినప్పుడు ఉష్ణోగ్రతను తగ్గించడానికి ఒక  ఇంట్లో తయారుచేసిన ఉత్తమ ఔషధం.  మెంతి ఆకుకూరలలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటుగా ఎన్నో ముఖ్యమైన విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తాన్ని శుద్ధి చేయడా నికి ఉపయోగపడతాయి. అలాగే జుట్టును, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని తీసుకోవడం వల్ల జుట్టు ఊడిపోవడం తగ్గుతుందట.