12 July, 2026 | 10:57 AM

గోల్డ్ బాండ్ల సంగతేమిటి..?

05-05-2024 12:50 AM

ముందుగానే సొమ్ము చేసుకుంటారా?.. మరో ఏడాది ఆగుతారా?

ఈ నెలలో ముందస్తు విత్‌డ్రాయిల్ అవకాశం

రిజర్వ్‌బ్యాంక్ గతంలో జారీచేసిన కొన్ని సావరిన్ గోల్డ్ బాండ్లు (ఎస్‌జీబీలు) ఈ మే నెలలో ముందస్తు విత్‌డ్రాయిల్‌కు వస్తున్నారు. ఎనిమిదేండ్ల కాలపరిమితితో జారీ అయ్యే ఈ బాండ్లలో మదుపు చేసిన ఐదేండ్ల తర్వాత కూడా ముందస్తుగా సొమ్ము చేసుకునే అవకాశాన్ని ఆర్బీఐ కల్పిస్తుంది. బంగారం రికార్డుస్థాయికి చేరిన తరుణంలో గోల్డ్ బాండ్లను నగదుగా మార్చుకుంటే ఆకర్షణీయమైన రాబడులు వస్తాయన్న ఆలోచన సహజంగానే చాలా మంది ఇన్వెస్టర్ల మదిలో మెదులుతుంది. అందుచేత ఈ నెలలో ముందస్తు విత్‌డ్రాయిల్‌కు అవకాశం ఉన్న బాండ్లను సొమ్ము చేసుకోవాలన్న  ప్రయత్నాలు కూడా మొదలుపెడతారు. ఈ నేపథ్యంలో ముందస్తు విత్‌డ్రాయిల్‌కు వెళ్లేముందు ఎంత రాబడి వస్తుంది? ఎంత పన్ను చెల్లించాలి? పూర్తి మెచ్యూరిటీ కోసం మరో మూడేండ్లు ఆగవచ్చా? తదితర కొన్ని కీలక అంశాలను తెలుసుకునేందుకే ఈ కథనం.

ఎంత రాబడి ఆశిస్తున్నారు?

 సావరిన్ గోల్డ్ బాండ్ 2017 సిరీస్ (2017 నవంబర్ 20 జారీతేదీ) ఈ ఏడాది మే 20న  ముందస్తు రిడంప్షన్‌కు వస్తున్నది. మెచ్యూరిటీ తేదీకి ముందు ఇండియన్ బులియన్ జ్యువెల్లర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) ప్రచురించే .999 స్వచ్ఛత గల బంగారం మూడు రోజుల ముగింపు ధరల సగటు ఆధారంగా గోల్డ్ బాండ్ల ప్రిబె రిడంప్షన్ ధరను రిజర్వ్‌బ్యాంక్ నిర్ణయిస్తుంది. ఉదాహరణకు మే 20కి ముందు గ్రాము బంగారం మూడు రోజుల సగటు ధర రూ.7,217 ఉంటే అదే ధరను  సావరిన్ గోల్డ్ బాండ్ 2017 సిరీస్ రిడంప్షన్ ధర అవుతుంది. 2017 నవంబర్ 20న ఈ సిరీస్ బాండును గ్రాముకు రూ.2,961 ధరతో జారీచేశారు. పెట్టుబడిపై 2.5 శాతం వార్షిక స్థిర వడ్డీని సైతం ఆఫర్ చేశారు. వడ్డీ చెల్లింపు ఆరునెలలకోసారి ఉంటుంది. అంటే..మీరు ఈ బాండ్లలో రూ.1 లక్ష పెట్టుబడి చేసిఉంటే ఇప్పటివరకూ మీరు అందుకున్న వడ్డీతో పాటు ప్రస్తుతం ఉన్న బంగారం ధర ప్రకారం బాండ్లను ఈ నెలలో ముందస్తుగా సొమ్ముచేసుకుంటే రూ.2.43 లక్షలు అందుకుంటారు. మీ లక్ష పెట్టుబడి మీద గత ఏడేండ్లలో ప్రతీ ఆరునెలలకు రూ.1,250 వడ్డీ మీకు లభించింది. ఈ వడ్డీని, ప్రస్తుతం ఉన్న బంగారం ధరను కలిపి చూస్తే  సావరిన్ గోల్డ్ బాండ్ 2017 సిరీస్ మీకు 16.5 శాతం వార్షిక రాబడి అందిస్తున్నట్టు. ముందస్తు మెచ్యూరిటీ తేదీకి ముందు రోజుల్లో బంగారం ధర హెచ్చుతగ్గులను బట్టి రాబడిలో కొంత మార్పు ఉండవచ్చు. స్టాక్ మార్కెట్ రాబడులకంటే ఈ సిరీస్ గోల్డ్ బాండ్లు అందించిన లాభమే ఎక్కువ.  సావరిన్ గోల్డ్ బాండ్ 2017 సిరీస్ జారీచేసిన తేదీ నుంచి ఇప్పటివరకూ ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 13.62 శాతం వార్షిక రాబడిని ఇచ్చింది. 

సావరిన్ గోల్డ్ బాండ్ల లాభాలపై పన్ను

సావరిన్ గోల్డ్ బాండ్లపై వచ్చే లాభాలు, వడ్డీపై ఆదాయపు పన్ను చట్ట ప్రకారం పన్ను వర్తింపు చేస్తారని ఆర్బీఐ వెబ్‌సైట్ పేర్కొంటున్నది. అయితే పూర్తి మెచ్యూరిటీ (8 ఏండ్లు) అనంతరం వ్యక్తులు ఈ బాండ్లను నగదుగా మార్చుకుంటే వచ్చే మూలధన లాభాలపై పన్ను మినహాయించారు. ముందస్తు రిడంప్షన్‌పై ఆదాయపు పన్ను అంశాన్ని స్పష్టంగా పేర్కొనకపోయినా, వ్యక్తులకు వీటిపై కూడా పన్ను మినహాయింపు ఉంటుందని ట్యాక్స్ కన్సల్టింగ్ సంస్థ నంగియా యాండర్సన్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యోగేశ్ కాలే తెలిపారు. కానీ మరికొంతమంది ట్యాక్స్ నిపుణులు పూర్తి మెచ్యూరిటీ తర్వాతే పన్ను మినహాయింపు వర్తిస్తుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగత మదుపుదారులు కాకుండా సంస్థలు, ట్రస్టులు రిడీమ్ చేసుకునే ఎస్‌జీబీలపై పన్ను మినహాయింపు లేదు. 

పసిడి ధరను గమనించండి

ఎస్‌జీబీల్లో పెట్టుబడి ఉన్న ఇన్వెస్టర్లు బంగారం ధరల ప్రస్తుత ట్రెండ్‌ను గమనించాలని ఆర్‌ఎస్‌ఎం వ్యవస్థాపకుడు సురేష్ సురానా సూచించారు. ఇప్పుడు బంగారం ధర బాగా పెరిగి ఉన్నది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ ప్రధాన దేశాల ఆర్థిక స్థితిగతులు, ద్రవ్యోల్బణంపై అంచనాలు బంగారం ట్రెండ్‌ను ప్రభావితం చేస్తాయని ఆయన చెప్పారు. అయితే వచ్చే మూడేండ్లలో బంగారం ధర ఆల్‌టైమ్ కనిష్టాలకు పడిపోయే అవకాశాలు చాలా తక్కువని, ధర స్వల్ప ఒడిదుడుకులతో పెరుగుతూ ఉంటుందని అంచనా వేశారు.

తీసుకుంటారా?  వేచిచూస్తారా?

ఈ నెలలో ముందస్తు రిడంప్షన్‌కు వస్తున్న ఎస్‌జీబీలను ఇప్పుడు సొమ్ముగా మార్చుకోవాలా? మరో ఏడాది పూర్తి మెచ్యూరిటీవరకూ వేచిచూడాలా అనేది ఆయా మదుపుదారుల ఆర్థికావసరాలు, ఆర్థిక లక్ష్యాలు, మార్కెట్ పట్ల వారి అంచనాలు, నగదు తక్షణావసరం తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది. బంగారం ధర గత కొద్ది నెలల్లోనే 20 శాతం మేర పెరిగింది. ఈ కారణంగా ఇప్పుడు ముందస్తు విత్‌డ్రాయిలే మెరుగు అన్న భావన కొంతమందిలో ఉంటుందని ట్యాక్స్2విన్ వ్యవస్థాపకుడు అభిషేక్ సోని చెప్పారు. తక్షణ ఆర్థికావసరాలు ఉంటే ఎస్‌జీబీలను ముందస్తుగా విత్‌డ్రా చేసుకోవచ్చని సూచిస్తున్నారు. అది లేకుంటే మీ పెట్టుబడుల్లో కొంత బంగారం పెట్టుబడి కూడా ఉంటే మంచిదని సిఫార్సుచేస్తున్నారు. సాధారణంగా మీ పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో 5 శాతం నుంచి 10 శాతం వరకూ బంగారంలో మదుపు చేయవచ్చని, అంతకు మించి ఎస్‌జీబీల్లో మీ మదుపు ఉంటే ముందస్తు రిడంప్షన్ చేసుకోవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు.

బాండ్లను స్టాక్ ఎక్సేంజీల్లో విక్రయిస్తే..

ఎస్‌జీబీలను ఆర్బీఐ మెచ్యూరిటీ వరకూ చూడకుండా స్టాక్ ఎక్సేంజీల్లో ఎప్పుడైనా విక్రయించుకునే వీలున్నది. అలా అమ్ముకుంటే దానిమీద వచ్చే దీర్ఘకాలిక మూలధన లాభాలు (36 నెలలు పైబడితే), స్వల్పకాలిక మూలధన లాభాలపై (36 నెలల లోపు) ఆదాయపు పన్ను ఉంటుందని యోగేశ్ వివరించారు. లాంగ్‌టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌పై ఇండెక్సేషన్  ప్రయోజనాన్ని కల్పించారని తెలిపారు. స్టాక్ ఎక్సేంజీల్లో ఎస్‌జీబీలను విక్రయించే ఇన్వెస్టర్లు ఈ అంశాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ఎస్‌సీబీ జారీ అయిన తర్వాత ఐదేండ్ల ముందుగానీ, తర్వాతగానీ..ఎప్పుడు స్టాక్ ఎక్సేంజీలో అమ్మినా పన్ను పడుతుంది. అయితే ఒకటి గుర్తుంచుకోండి.  స్టాక్ ఎక్సేంజ్‌లో ఎస్‌జీబీలు చురుగ్గా ట్రేడ్‌కావు. అవసరార్థం విక్రయించాలనుకునేవారికి సరైన ధర లభించదు.

ఈ నెలలో రిడంప్షన్‌కు వచ్చే బాండ్లు

ఎస్‌జీబీ 2017 ఎస్‌జీబీ 2017

18 సిరీస్ 18 సిరీస్

జారీ తేదీ 2017 నవంబర్ 20 2017 నవంబర్ 27

జారీ ధర (గ్రాముకు రూ.ల్లో) 2,961 2,964

అంచనా మెచ్యూరిటీ విలువ (రూ.ల్లో) 7,217 7,217

ప్రిమెచ్యూర్ విత్‌డ్రాయిల్ తేదీ 2024 మే 20 2024 మే 27

వడ్డీ రేటు 2.5 శాతం 2.5 శాతం

రాబడి శాతం (ప్రస్తుత ధర ప్రకారం) 16.50 16.44

విత్‌డ్రాయిల్‌కు గుర్తుంచుకోవాల్సిన అంశాలు

ముందస్తు విత్‌డ్రాయిల్‌కు రిజర్వ్‌బ్యాంక్ 21 రోజుల సమయం ఇస్తుంది. ఈ రోజుల్లోనే మీరు విత్‌డ్రాయిల్ కోరుతూ ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్/ఎన్‌ఎస్‌డీఎల్/సీఎస్‌డీఎల్‌కు రిక్వెస్ట్ సమర్పించాలి.  సావరిన్ గోల్డ్ బాండ్ 2017 సిరీస్ ఆ సమయం ఏప్రిల్ 20 నుంచి మే 10. అంటే ఇప్పటికి మరో ఆరు రోజుల గడువు ఉన్నది. అలాగే తదుపరి రోజుల్లో ముందస్తు రిడంప్షన్‌కు వచ్చే బాండ్లను మీరు సొమ్ముగా మార్చుకోవాలనుకుంటే రిక్వెస్ట్ సమర్పించే తేదీల వివరాలు ఆర్బీఐ వెబ్‌సైట్‌లో లభిస్తాయి. 

ఎస్‌జీబీని విత్‌డ్రా చేసుకునేందుకు అదనపు ఛార్జీలేవీ ఉండవు. ముందస్తు విత్‌డ్రాయిల్‌కు కూడా ఛార్జీలేవీ వర్తించవు.  ఎస్‌జీబీలను ముందస్తుగా విత్‌డ్రా చేసుకున్న తర్వాత ఆ సొమ్మును గోల్డ్ బాండుకు దరఖాస్తు చేసుకున్నప్పుడు మీరు ఇచ్చిన బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు.