20-07-2024 12:05:00 AM
నాగర్‌కర్నూల్, జూలై 19 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ బీఆర్‌ఎస్ పార్టీలో ముసలం నెలకొంది. పార్టీ జెండాను కాపాడుకుంటూ గ్రామ, గ్రామాన తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిన ముఖ్య నేతలను విస్మరించి కేవలం తన వర్గం, తన సామాజిక వర్గాన్ని మాత్రమే అందలమెక్కిస్తూ బడుగు, బలహీన వర్గాలను అణగదొక్కాలని చూస్తున్నాడంటూ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డిపై స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బైకాని శ్రీనివాస్‌యాదవ్, జడ్పీ మాజీ చైర్మన్ పెద్దపల్లి పద్మావతిబంగారయ్య, ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు మంగి విజయ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కిరణ్ తదితర ముఖ్య నేతలు మాజీ ఎమ్మెల్యేపై శుక్రవారం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఫిర్యాదు చేశారు.
కొన్ని రోజులుగా మాజీ ఎమ్మెల్యే వ్యవహారశైలి పూర్తిగా మారిందని, తద్వారా పార్టీ పూర్తిగా దెబ్బతింటోందని కేటీఆర్‌కు తమ గోడును వెల్లబోసుకున్నట్లు సమాచారం. ఈ అహంకారపూరిత నేత తమకొద్దని కుండబద్దలు కొట్టినట్లు విశ్వసనీయంగా తెలిసింది. మాజీ మంత్రి నాగం జనార్ధన్‌రెడ్డిని ఓడించాలనే లక్ష్యంతో 2009 ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన మర్రి జనార్ధన్‌రెడ్డి ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి భారీ మెజారీటీతో గెలుపొందారు. ఆ సమయంలోనూ టీఆర్‌ఎస్ ఉద్యమపార్టీకి కంకణ బద్దులుగా పనిచేసిన ఉద్యమకారులంతా అతడి గెలుపు కోసం పనిచేశారు.
ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ పార్టీ నిర్ణయానికి కట్టబడి మర్రి జనార్ధన్‌రెడ్డి గెలుపు కోసం పనిచేశారు. వారికి మాత్రం చిన్నపాటి పదవులను అప్పజెప్పారు. అయితే ప్రజల నుం చి తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న మర్రి జనార్ధన్‌రెడ్డి ఇటీవల జరిగిన ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమిచెందారు. ఎంపీ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి పార్లమెంటు స్థానం నుంచి పోటీచేసే ప్రక్రియలో భాగంగా పార్టీ మారే ఆలోచన చేసిన మర్రి ప్రయత్నం విఫలమైంది.
ఈ క్రమంలో నాగర్‌కర్నూల్ నియోజకవర్గంపై శ్రద్ధ చూపడం లేదన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. మాజీ సీఎం కేసీఆర్‌ను కూడా కలిసి నాగర్‌కర్నూల్ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జి బాధ్యతలను జనార్ధన్‌రెడ్డి నుంచి తప్పించి ఉద్యమ నాయకులకు ఇవ్వాలని కోరనున్నట్లు ప్రచారం జరుగుతోంది.