17 May, 2026 | 3:37 PM

షాద్‌నగర్‌లో ఘోరం.. మేస్త్రి జయరాంపై కత్తులతో దాడి

17-05-2026 02:35 PM

గొంతు కోసిన దుండగులు

షాద్ నగర్,(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు మేస్త్రి జయరాంపై కత్తులతో దాడి చేసి, గొంతు కోసి పరారయ్యారు. తీవ్ర గాయాలతో కుప్పకూలిన జయరాంను స్థానికులు, పోలీసులు కలిసి వెంటనే షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతరం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి రిఫర్ చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం.

చౌదర్‌గూడ మండలం పెద్ద ఎలికిచర్ల గ్రామానికి చెందిన జయరాం గత కొన్నేళ్లుగా షాద్‌నగర్‌లో నివాసం ఉంటూ మేస్త్రి పనులు చేసుకుంటూ భార్య, పిల్లలను పోషిస్తున్నాడు. ఆదివారం తెల్లవారుజామున శివరాం నాయక్ ఆసుపత్రి సమీపంలో ఉండగా ఇద్దరు వ్యక్తులు అక్కడికి చేరుకుని అకస్మాత్తుగా కత్తులతో దాడి చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దుండగులు జయరాంను విచక్షణారహితంగా పొడిచి, గొంతు కోసి అక్కడి నుంచి పరారయ్యారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. పాత కక్షలా..? వ్యక్తిగత విభేదాలా..? లేక మరేదైనా కారణమా..? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. పట్టణంలో నడిబొడ్డున జరిగిన ఈ దారుణ ఘటన స్థానికుల్లో భయాందోళనలకు గురిచేసింది. దుండగులను త్వరగా పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.