17 May, 2026 | 4:18 PM

తల్లి, కుమార్తెను హత్య చేసిన గుర్తుతెలియని దుండగులు

17-05-2026 03:02 PM

నల్గొండ: నల్గొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గుర్తుతెలియని దుండగులు తల్లి, కుమార్తెను హత్య చేసిన ఘటన అనుముల మండలం, ఇబ్రహీంపేటలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. స్థానికుల కథనం ప్రకారం... గుర్తుతెలియని వ్యక్తులు ఆ మహిళపై, కుమార్తెపై మిరపపొడి చల్లి, వేట కొడవళ్లతో వారిపై దాడి చేశారని తెలిపారు. ఈ దాడిలో ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు.

స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను  నాగార్జున సాగర్‌లోని కమలా నెహ్రూ ఆసుపత్రికి తరలించారు. బాధితులను ఇబ్రహీంపేటకు చెందిన రుద్రాక్ష సుమలత, ఆమె కుమార్తె లావణ్యగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు భూ వివాదమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.